NewYork Times Most Stylish People | బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మరోసారి అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. ఇప్పటికే నేషనల్ అవార్డుతో పాటు మెట్‌గాలాలో సందడి చేసిన మొట్టమొదటి భారతీయ నటుడిగా రికార్డు అందుకున్న షారుఖ్ తాజాగా మరో రికార్డును అందుకున్నాడు. ప్రతిష్టాత్మక ‘ది న్యూయార్క్ టైమ్స్’ విడుదల చేసిన 2025 సంవత్సరపు 67 మంది అత్యంత స్టైలిష్ వ్యక్తుల (Most Stylish People) జాబితాలో షారుఖ్ చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో స్థానం సంపాదించిన ఏకైక భారతీయుడిగా షారుఖ్ ఖాన్ నిలవడం విశేషం.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మెట్ గాలా ఈవెంట్‌కు తొలిసారిగా హాజరైనందుకుగాను షారుఖ్ ఖాన్‌కు ఈ అరుదైన గౌరవం లభించింది. ఈ ఫ్యాషన్ ఈవెంట్లో ఆయన ప్రముఖ భారతీయ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ ప్రత్యేకంగా రూపొందించిన నలుపు రంగు దుస్తుల్లో కనిపించారు. నలుపు రంగు కోట్, ప్యాంట్ ధరించిన షారుఖ్, తన మెడలో ‘K’ (కే) అక్షరం ఆకారంలో వజ్రాలు పొదిగిన పెండెంట్‌ను ధరించడం హైలైట్‌గా నిలిచింది. ఈ లుక్ ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ‘ది న్యూయార్క్ టైమ్స్’ షారుఖ్ ఖాన్‌ను బాలీవుడ్‌లోని అతిపెద్ద స్టార్ అలాగే ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ నటులలో ఒకరుగా పేర్కొంది.
ఈ జాబితాలో షారుఖ్ ఖాన్‌తో పాటు జెన్నిఫర్ లారెన్స్, సబ్రినా కార్పెంటర్, డోచి, నికోల్ షెర్జింగర్ వంటి అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు ఉన్నారు. సినిమాల విషయానికి వస్తే.. షారుఖ్ ఖాన్ ప్రస్తుతం త్వరలో రాబోయే భారీ యాక్షన్ చిత్రం ‘కింగ్’ కోసం సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్‌తో పాటు ఆయన కుమార్తె సుహానా ఖాన్ మరియు స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ మరియు మార్ఫ్లిక్స్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.