Google Maps | గువాహటి, జనవరి 8: నిందితుడిని పట్టుకునేందుకు గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకున్న పోలీసులు పక్క రాష్ట్రంలోకి వెళ్లి అక్కడి స్థానికులకు బందీలుగా మారారు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఓ నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టిన అస్సాం పోలీసులకు చెందిన 16 మంది సభ్యుల బృందం గూగుల్ మ్యాప్స్ చూపించిన మార్గంలో ప్రయాణించి చివరకు నాగాలాండ్‌లో తేలింది. అది అస్సాంలోని తేయాకు తోటగా గూగుల్ మ్యాప్స్ చూపించిందని, వాస్తవానికి అది నాగాలాండ్గా తేలిందని అస్సాం పోలీసుకు చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారు.
వీరి వద్ద ఉన్న అధునాతన ఆయుధాలు చూసిన స్థానికులు దుండగులుగా అనుమానించి బంధించారని ఆయన చెప్పారు. పైగా వీరిలో ముగ్గురు మాత్రమే యూనిఫాంలో ఉండగా మిగిలిన వారంతా సివిల్ డ్రెస్‌లో ఉన్నారని ఆయన తెలిపారు. స్థానికుల దాడిలో తమ బృందం సభ్యుడు ఒకరికి గాయమైందని అధికారి చెప్పారు. సమాచారం అందుకున్న జోర్హాట్ ఎస్పీ అస్సాం పోలీసులతో మాట్లాడి పరిస్థితిని వివరించారు. అస్సాం పోలీసులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు. వీరంతా నిజమైన పోలీసులే అని నిర్ధారించుకున్న స్థానికులు రాత్రి ఐదుగురిని విడిచిపెట్టి, మిగిలిన 11 మందిని ఉదయం వదిలిపెట్టారని ఆ అధికారి చెప్పారు.