Google Maps | న్యూఢిల్లీ, డిసెంబర్ 15: గూగుల్ మ్యాప్ మరింత సౌకర్యవంతంగా, యూజర్ ఫ్రెండ్లీగా మార్చేందుకు సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు గూగుల్ కంపెనీ ప్రకటించింది. ప్రయాణికులు తమ వాహనాల్లోని ఇంధనాన్ని మరింతగా ఆదా చేసుకునేందుకు కొత్త ఫీచర్ (రూట్ ఆప్షన్)ను తీసుకొస్తున్నట్టు శుక్రవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది.
దీని ప్రకారం.. వాహనం ఇంజిన్ను అనుసరించి ఎకో ఫ్రెండ్లీ రూట్ (ఇంధనం ఖర్చు తక్కువ అయ్యే మార్గం), ఎక్కువ ఇంధనం తీసుకునే ‘ఫాస్టెస్ట్ రూట్’ను గూగుల్ మ్యాప్ చూపుతుందట. కర్బన ఉద్గారాల్ని తగ్గించటంలోనూ ఇది సహాయపడుతుందని గూగుల్ పేర్కొన్నది. భారత్ సహా ఎంపిక చేసిన దేశాల్లో సరికొత్త ఫీచర్తో కూడిన గూగుల్ మ్యాప్ త్వరలో అందుబాటులోకి వస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.