Jabalpur | జబల్పూర్ : మోకాళ్ల నొప్పులు తగ్గిస్తానంటూ రిటైర్డ్ టీచర్ను బురిడీ కొట్టించిన ఇద్దరు అతని నుంచి రూ.లక్ష కాజేసిన ఘటన మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగింది. కేఎల్ సోనీ (78) కొంతకాలంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. మందులు కొనుగోలు చేసి వస్తున్న సోనీని ఒక యువకుడు పలుకరించాడు. తన తల్లి కూడా మోకాళ్ల నొప్పులతో బాధపడేదని, ఆర్కే పటేల్ అనే డాక్టర్ నయం చేశాడని చెప్పి, అతని చిరునామాను తెలుసుకున్నాడు. కొన్ని రోజులకు డాక్టర్ పటేల్ పేరుతో ఒక వ్యక్తి ఆ వృద్ధుడి ఇంటికి వచ్చి పరీక్షలు చేసి, అతని పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, ఆలస్యమైతే కాళ్లు తీసేయాల్సి ఉంటుందని హెచ్చరించాడు.
దానికి తాను చికిత్స చేస్తానని నమ్మించి ఒక పరికరంతో కొంత రక్తం తీశాడు. ప్రతి రక్తపు చుక్కకు రూ.3వేల చొప్పున రూ.6.5 లక్షలు బిల్లు అయినట్టు చెప్పాడు. దీంతో బెంబేలెత్తిన సోనీ తన వద్ద అంత డబ్బు లేదని చెప్పి అతనికి రూ.లక్ష ఇచ్చాడు. ఆ సొమ్ము తీసుకుని కొన్ని మందులు రాసిచ్చిన ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ మందులు కొనడానికి వెళ్లగా రూ.75 వేలని చెప్పడంతో కొనకుండానే ఇంటికి వస్తుండగా, మరో వ్యక్తి ఎదురై గతంలోలానే ప్రశ్నించి.. డాక్టర్ పటేల్ నయం చేస్తారని చెప్పడంతో మోసపోయినట్టు గ్రహించిన వృద్ధుడు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.