EPF | న్యూఢిల్లీ: ఉద్యోగి ఒక సంస్థ నుంచి మరొక సంస్థకి మారినపుడు ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతాను కొత్త యాజమాన్యానికి మార్చుకోవడం ఇకపై సులభం కానుంది. ఈ ఖాతాల ఆన్లైన్ బదిలీ క్లెయిముల కోసం పాత, కొత్త యాజమాన్యాల మధ్య తిరగవలసిన అవసరం ఉండదు.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ప్రకటించిన సంస్కరణల ప్రకారం, ఉద్యోగులు తమంతట తామే కొత్త యాజమాన్యానికి తమ ఈపీఎఫ్ ఖాతాను బదిలీ చేసుకోవచ్చు. ఉద్యోగాలు మారేవారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈపీఎఫ్ ఖాతాలను బదిలీ చేసుకోవడానికి అవకాశం కల్పించేందుకు ఈపీఎఫ్ఓ ఈ చర్యలు తీసుకుంది.
దీనివల్ల పీఎఫ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ మెరుగుపడుతుందని, జాప్యాలు తగ్గుతాయని ఈపీఎఫ్ఓ తెలిపింది. ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా మెంబర్స్ తమ పీఎఫ్ ఖాతాను బదిలీ చేసుకోవచ్చు. యాజమాన్యాలపై ఆధారపడవలసిన అవసరం తగ్గుతుంది.