EPFO | న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉన్న తన ప్రాంతీయ కార్యాలయాల్లో కేంద్రీకృత పెన్షన్ చెల్లింపుల విధానాన్ని(సీపీపీఎస్) అమలు చేసే ప్రక్రియను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పూర్తి చేసింది. దీని ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా, ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ పొందేందుకు వీలవుతుంది. సుమారు 56 లక్షల మందికి పైగా పెన్షనర్లకు దీని ద్వారా లబ్ధి చేకూరుతుందని కేంద్ర కార్మిక శాఖ శుక్రవారం ప్రకటించింది. ఇదివరకు ఉన్న డీసెంట్రలైజ్డ్ విధానంలో ఈపీఎఫ్వో జోనల్/ప్రాంతీయ కార్యాలయాలు కేవలం 3-4 బ్యాంకులతో మాత్రమే ఒప్పందాలు కలిగి ఉండేవి.
దీంతో పింఛన్ ప్రారంభ సమయంలో పింఛన్దారులు ధ్రువీకరణ కోసం సంబంధిత బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం ఉండేది. కొత్తగా తీసుకొచ్చిన సెంట్రలైజ్డ్ విధానం వల్ల ఇక ఆ అవసరం ఉండదు. విడుదలైన వెంటనే పెన్షన్ డబ్బు బ్యాంకులో జమ అయిపోతుంది. పెన్షనర్ ఒక ఊరి నుంచి మరో ఊరికి బదిలీ అయినా లేదా ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు కాని ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచికి కాని బదిలీ చేసుకున్నపుడు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ల(పీపీఓ) అవసరం లేకుండానే దేశవ్యాప్తంగా పెన్షన్ చెల్లింపు జరుగుతుంది. సీపీపీఎస్ విధానం 2025 జనవరి నుంచి అమలు అవుతుందని కార్మిక శాఖ తెలిపింది.