FASTag | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: జాతీయ రహదారులపై టోల్ వసూలు కోసం ఇప్పుడున్న ఫాస్టాగ్ విధానాన్ని మార్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఫాస్టాగ్ స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు పద్ధతిని దశలవారీగా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్టు కేంద్రం శనివారం ప్రకటించింది.
పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలు, వాహనదారుల డాటా ప్రైవసీ సమస్యలు పరిష్కరించాక ముందుకు వెళ్తామని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) తెలిపింది. కొన్ని ఎంపిక చేసిన రహదారులపై ‘పైలట్ ప్రాజెక్ట్’ చేపడుతున్నట్టు జాతీయ రహదారులు మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ మీడియాకు తెలిపారు. కొత్త విధానం ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉందని, అనేక రకాలుగా పరీక్షించాక దేశవ్యాప్తంగా అమల్లో తెస్తామని కేంద్రం ఈ మేరకు తెలిపింది.
ఆటోమేటిక్‌గా టోల్‌ను వసూలు చేసే ఫాస్టాగ్‌ను కేంద్రం 2016లో ప్రవేశపెట్టింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాన్ని ఆపి టోల్ చెల్లింపు ప్రక్రియ పూర్తిచేయాలి. దీంతో టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్‌కు దారి తీస్తున్నది. వాహనాల రాకపోకలు నెమ్మదిస్తున్నాయి. దీనిని తప్పించేందుకు కొత్తగా జీపీఎస్ ఆధారిత టోల్ చెల్లింపు విధానాన్ని తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నది.
ఇదెలా పనిచేస్తుంది?
వాహనంలోని జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) పరికరాలు లేదా ఏఎన్పీఆర్ కెమెరా పరికరాలు టోల్ రోడ్డుపై వాహనం ఎంత దూరం ప్రయాణించిందన్నది కచ్చితంగా లెక్క తేల్చుతుంది. దీనికి ఎంత మొత్తం చెల్లించాలన్నది కూడా నిర్ణయిస్తుంది. వాహనం డ్రైవర్ బ్యాంక్ ఖాతా లేదా ప్రీ పెయిడ్ ఖాతా నుంచి చెల్లింపు లావాదేవీ ఆటోమెటిక్‌గా పూర్తి చేస్తుంది. ఇది పనిచేయాలంటే వాహనంలో జీపీఎస్ వ్యవస్థ ఉండాలి. ఇది లేని వాహనాలు జీపీఎస్ పరికరాల్ని అమర్చుకోవాల్సి ఉంటుంది.