బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 01, 2020 , 03:16:14

తేరుకుంటున్న ఢిల్లీ

తేరుకుంటున్న ఢిల్లీ
  • ఇండ్ల నుంచి బయటికి వస్తున్న ప్రజలు
  • మార్చి 7 వరకు పాఠశాలలకు సెలవులు
  • నష్టాన్ని విధ్వంసకారుల నుంచే వసూలు చేయాలని ఢిల్లీ పోలీసుల నిర్ణయం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: కొన్ని రోజులుగా మత ఘర్షణలతో అట్టుడుకిన ఈశాన్య ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. శుక్రవారం కాస్త కుదుటపడిన ఈ ప్రాంతం.. శనివారం కూడా ప్రశాంతంగా ఉన్నది. ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రావడం కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న దుకాణాలు తెరుచుకున్నాయి. ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో భద్రతా బలగాలు శనివారం కూడా కవాతు నిర్వహించాయి. సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని, అలాంటి వాటిని వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించాయి. అల్లర్లలో పాల్గొన్న వారిలో ఇప్పటి వరకు 1000 మందిని గుర్తించామని, 630 మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తులను ధ్వంసం చేసిన వారి నుంచే నష్టాన్ని వసూలు చేయాలని నిర్ణయించారు. మరోవైపు ప్రాణాలు కోల్పోయిన తమ వారి మృతదేహాలను తీసుకెళ్లడానికి పలువురు జీటీబీ దవాఖాన వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈశాన్య ఢిల్లీలో మార్చి 7 వరకు పాఠశాలను మూసివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. 


జవాన్‌కు ఇల్లు కట్టిస్తాం: బీఎస్‌ఎఫ్‌

దుండగులు తగులబెట్టిన జవాన్‌ మహమ్మద్‌ అనీస్‌ ఇంటిని తిరిగి నిర్మిస్తామని బీఎస్‌ఎఫ్‌ తెలిపింది. ఆయన ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌లోని రాధాబరి బీఎస్‌ఎఫ్‌ క్యాంప్‌లో విధులు నిర్వర్తిస్తుండగా, కుటుంబం ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో ఉంటున్నది. అనీస్‌కు త్వరలో పెండ్లి కావాల్సి ఉన్నది. దాడుల్లో ఆయన ఇల్లు తగలబడిపోయిందన్న విషయం తెలుసుకున్న బీఎస్‌ఎఫ్‌ దాన్ని పునర్నిర్మించి పెండ్లి కానుకగా అందజేయాలని నిర్ణయించింది. 


logo
>>>>>>