భోపాల్: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో గురువారం లోకాయుక్త చేసిన సోదాల్లో ప్రజా పనుల శాఖ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ జీపీ మెహ్రాకు నమ్మశక్యం కాని రీతిలో ఆస్తులున్నట్టు గుర్తించారు. రూ.లక్షల కొద్ద్దీ డబ్బు, కిలోల కొద్దీ బంగారం, వెండితో పాటు ఆశ్చర్యకరంగా 17 టన్నుల తేనె ఆయన ఫామ్ హౌస్‌లో లభించింది. నలుగురు డీఎస్పీలు భోపాల్, నర్మదపురంలో ఈ సోదాలు చేశారు. మణిపురం కాలనీలోని మెహ్రా ఇంట్లో సుమారు రూ.8.79 లక్షల నగదు, రూ.50 లక్షల విలువైన నగలు, రూ.56 లక్షల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు దొరికాయి.
మరో ఇంట్లో రూ.26 లక్షల నగదు, రూ.3.05 కోట్ల విలువైన 2.6 కిలోల బంగారం, 5.5 కిలోల వెండి లభించాయి. సైని గ్రామంలోని మెహ్రా ఫామ్ హౌస్‌లో 17 టన్నుల తేనె, ఆరు ట్రాక్టర్లు, నిర్మాణంలో ఉన్న 32 కాటేజీలు, ఏడు పూర్తయిన కాటేజీలు, మెహ్రా కుటుంబ సభ్యుల పేరిట నమోదైన విలాసవంతమైన కార్లను కనుగొన్నారు. కేటీ ఇండస్ట్రీస్‌లో ఆయన బంధువులు భాగస్వాములుగా ఉన్నట్టు గుర్తించి రూ.1.25 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.