న్యూఢిల్లీ: మరికొద్ది గంటల్లో జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర అసెంబ్లీకి ఐదుగురు సభ్యుల్ని నామినేట్ చేసే అధికారం ఎల్జీకి ఉండటం రాజకీయంగా కీలకంగా మారింది. ఎట్టి పరిస్థితిలో దీనిని అంగీకరించబోమని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు సోమవారం ప్రకటించాయి. సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని తెలిపాయి. జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో మెజార్టీ మార్క్ 48 ఏ ఒక్క పార్టీకి రాకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. దీంతో ఎల్జీ తన అధికారాల్ని వినియోగిస్తారా? ప్రభుత్వం ఏర్పాటయ్యాక క్యాబినెట్ సలహా మేరకు సభ్యుల్ని నామినేట్ చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఎల్జీ నామినేట్ చేసేవారు తమ పార్టీ నుంచే ఉంటారని బీజేపీ పేర్కొన్నది.