నా అరెస్టు వెనుక ముందస్తు కుట్ర
‘56 అంగుళాల పిరికితనం’ చర్య
మోదీని ఉద్దేశించి జిగ్నేశ్ మండిపాటు
న్యూఢిల్లీ, మే 2: ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో)లో గాడ్సే భక్తులు ఉన్నారని గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ అన్నారు. అస్సాం పోలీసులు తనను అరెస్టు చేయడం ముందస్తు కుట్ర అని, దీనికి పీఎంవోనే సూత్రధారి అని ఆరోపించారు. పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ఇది ‘56 అంగుళాల పిరికితనం’ చర్యగా అభివర్ణించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తనను నాశనం చేసేందుకు ఇదంతా చేశారని పేర్కొన్నారు. బీజేపీ నేతలు గాడ్సే భక్తులు కాకుంటే, ఎర్రకోట నుంచి ‘గాడ్సే ముర్దాబాద్’ అనాలని సవాల్ విసిరారు.
తనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసేలా మహిళా అధికారిణిపై ఒత్తిడి చేశారని, తనను వేధించేందుకు పన్నిన కుట్రలు విఫలమయ్యాయని మేవానీ పేర్కొన్నారు. తన అరెస్టు గురించి తెలియదని అస్సాం సీఎం చెప్పడం విడ్డూరంగా ఉన్నదని, బీజేపీ అగ్రనాయకత్వం ఆదేశాలతోనే తనపై కేసులు నమోదు చేయించారని దుయ్యబట్టారు. 22 ఎగ్జామ్ పేపర్ల లీకేజ్, ఇటీవల ముంద్రా పోర్టులో స్వాధీనం చేసుకున్న రూ.1.75 లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ వెనుక ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని, ఉనాలోని దళితులతో పాటు రాష్ట్రంలో మైనార్టీలపై అన్యాయంగా నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే జూన్ 1న గుజరాత్ బంద్కు పిలుపునిచ్చి, వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తానని హెచ్చరించారు.
అరెస్టు.. బెయిల్.. మళ్లీ అరెస్టు
ట్విట్టర్లో ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మేవానీని ఏప్రిల్ 19న గుజరాత్లో అరెస్టు చేసి అక్కడి నుంచి అస్సాంకు తరలించారు. ఈ కేసులో బెయిల్పై విడుదలై బయటకు వచ్చిన వెంటనే పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. మేవానీ మహిళా పోలీసు అధికారిణిపై దాడి చేశారని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు. అయితే ఇది తప్పుడు ఎఫ్ఐఆర్ అని, వండివార్చిన కేసు అని బార్పెట జిల్లాలోని స్థానిక కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మేవానీకి బెయిల్ మంజూరు చేసింది. ఫేక్ కేసులు, సర్వసాధారణమైన ఎన్కౌంటర్లతో అస్సాం పోలీసు రాజ్యంగా మారుతున్నదని, రాష్ట్ర పోలీసు వ్యవస్థ తనకు తాను సంస్కరించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని గువాహటి హైకోర్టును కోరింది.
బార్పెట కోర్టు పరిధి దాటింది!
జిగ్నేశ్ మేవానీ బెయిల్ మంజూరు సందర్భంగా అస్సాంలోని బార్పెట జిల్లా కోర్టు చేసిన వ్యాఖ్యలపై గువాహటి హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల పనితీరుకు సంబంధించి కింది కోర్టు చేసిన వ్యాఖ్యలు పరిధికి మించి ఉన్నాయని జస్టిస్ దేబాషిశ్ బౌరా పేర్కొన్నారు. న్యాయ శాస్ర్తానికి, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు.