థాణె: బాత్రూమ్లో కనిపించిన రక్తం మరకలు విద్యార్థినుల రుతు స్రావం వల్ల ఏర్పడ్డాయని అనుమానించిన ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం బాలికల దుస్తులు విప్పించి తనిఖీలు చేయడం వివాదాస్పదమైంది. బీజేపీ పాలిత మహారాష్ట్రలోని షహాపూర్లో ఈ ఘటన జరిగింది. ఈ అమానుష ఘటనను నిరసిస్తూ బాధితుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట బుధవారం ధర్నా నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఓ బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు పాఠశాల పిన్సిపల్, నలుగురు టీచర్లతో సహా ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. విద్యార్థిని తండ్రి కథనం ప్రకారం షహాపూర్లోని ఆర్ఎస్ దమానీ స్కూల్ శౌచాలయంలో రక్తపు మరకలు కనిపించాయి. దీంతో పాఠశాల యాజమాన్యం 5-10 తరగతుల విద్యార్థినులను సమావేశపరచి వారు రుతుస్రావ చక్రంలో ఉన్నారా లేదా అనే విషయాన్ని ప్రశ్నించింది.
రుతు స్రావంలో ఉన్నామని చెప్పిన విద్యార్థినుల వేలి ముద్రలను టీచర్లు సేకరించారు. రుతుస్రావంలో లేమని చెప్పిన బాలికలను ఒకరి తర్వాత ఒకరిని ఓ ఉద్యోగిని శౌచాలయంలోకి తీసుకెళ్లి వారి మర్మావయవాలను తనిఖీ చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని ఇన్స్పెక్టర్ ముకేశ్ దంగే తెలిపారు.