హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్, పార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఎంసెట్-2022లో అమ్మాయిలు సత్తా చాటారు. అన్ని విభాగాల్లో బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణత సాధించారు. అమ్మాయిలు ఇంజినీరింగ్‌లో 82.32 శాతం, అగ్రికల్చర్, మెడికల్ విభాగాల్లో 89.16 శాతం అర్హత సాధించారు.
అబ్బాయిలు ఇంజినీరింగ్‌లో 79.19 శాతం, అగ్రికల్చర్, మెడికల్‌లో 86.46 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి శుక్రవారం కూకట్పల్లి జేఎన్టీయూలో విడుదల చేశారు. మొత్తంగా ఇంజినీరింగ్‌లో 80. 41, అగ్రికల్చర్, మెడికల్‌లో 88.34 శాతం విద్యార్థులు అర్హత సాధించారు. అగ్రికల్చర్, మెడికల్ విభాగం టాపర్‌గా జూటూరి నేహ, ఇంజినీరింగ్ టాపర్‌గా పీ సాయిలోహిత్రెడ్డి నిలిచారు.
ఓవరాల్ ఫలితాల్లో అమ్మాయిలు అదరగొడితే.. టాప్ ర్యాంకుల్లో బాలురు సత్తా చాటారు. ఇంజినీరింగ్ టాప్ 10 ర్యాంకర్లలో 8 మంది అబ్బాయిలుండగా, అగ్రికల్చర్, మెడికల్ టాప్ -10 ర్యాంకర్లలో ఏడుగురు అబ్బాయిలే ఉన్నారు. గత ఏడాదితో పోల్చితే ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది కాస్త తగ్గింది. ఇంజినీరింగ్‌లో గత ఏడాది 82 శాతం, అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 92.48 శాతం విద్యార్థులు అర్హత సాధించారు.
ఈ ఏడాది ఇంజినీరింగ్‌లో 2 శాతం, అగ్రికల్చర్, మెడికల్‌లో 4 శాతం ఉత్తీర్ణ త తగ్గింది. ఫలితాల విడుదల కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లిం బాద్రి, కార్యదర్శి ఎన్ శ్రీనివాస్‌రావు, జేఎన్టీ యూ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, రిజిస్ట్రా ర్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్, ఎంసెట్ కన్వీ న్ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్, కో కన్వీనర్ ప్రొఫెసర్ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తెలంగాణ వైపు చూస్తున్నారు. ఇంజినీరింగ్‌లో చేరాలనుకుంటున్నవారిలో అత్యధికులు తెలంగాణలో చదివేందుకు ఇష్టపడుతున్నారు. తాజాగా విడుదలచేసిన తెలంగాణ ఎంసెట్ ఫలితాలే ఈ విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. ఈ ఫలితాల్లో ఇంజినీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ విభాగాల్లో తొలి పది ర్యాంకుల్లో ఏపీ విద్యార్థులే అత్యధిక ర్యాంకులు సొంతం చేసుకొన్నారు.
రెండు విభాగాల్లోనూ టాప్ 10లో ఏడుగురు చొప్పున ఏపీ విద్యార్థులే ఉండటం గమనార్హం. మరోవైపు ఎంసెట్ టాప్ 10 ర్యాంకర్లలో ఒక్కరు కూడా మొత్తం 160 మార్కులు సాధించలేకపోయారు. జేఈఈపై, నీట్‌పై దృష్టిపెట్టిన వీరంతా కేవలం ఎంసెట్‌ను అటెంప్ట్ చేసినట్టుగా తెలుస్తున్నదని జేఎన్టీయూ ప్రొఫెసర్ ఒకరు అభిప్రాయపడ్డారు.