చెన్నై: ఒక స్కూల్లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) నకిలీ క్యాంప్ నిర్వహించారు. సుమారు 13 మంది బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. (Girls Abused At Fake NCC Camp) బాధిత బాలికల ఫిర్యాదుతో స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్స్‌తో సహా 11 మందిని అరెస్ట్ చేశారు. తమిళనాడులోని కృష్ణగిరిలో ఈ సంఘటన జరిగింది. ఒక ప్రైవేట్ స్కూల్లో ఎన్సీసీ యూనిట్ లేదు. కొందరు వ్యక్తులు స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదించారు. ఎన్సీసీ క్యాంపు నిర్వహించడం వల్ల ఆ స్కూల్‌కు యూనిట్ అర్హత లభిస్తుందని నమ్మించారు.
కాగా, స్కూల్ యాజమాన్యం అనుమతి ఇవ్వడంతో ఆగస్ట్ ప్రారంభంలో మూడు రోజుల పాటు నకిలీ ఎన్సీసీ క్యాంప్ నిర్వహించారు. ఈ శిబిరంలో 17 మంది బాలికలు సహా 41 మంది విద్యార్థులు పాల్గొన్నారు. స్కూల్ ఆడిటోరియం మొదటి అంతస్తులో బాలికలకు, గ్రౌండ్ ఫ్లోర్లో బాలురకు వసతి కల్పించారు. అయితే ఎన్సీసీ శిబిరాన్ని పర్యవేక్షించేందుకు ఉపాధ్యాయులను నియమించలేదు. ఈ నేపథ్యంలో తమను ఆడిటోరియం నుంచి బయటకు రప్పించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాలికలు ఆరోపించారు. ఒక బాలికపై లైంగిక దాడి జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.
మరోవైపు సుమారు 13 మంది బాధిత బాలికల ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫేక్ ఎన్సీసీ క్యాంప్ నిర్వాహకుడు, స్కూల్ ప్రిన్సిపాల్, ఒక కరస్పాండెంట్, ఇద్దరు టీచర్స్‌తో సహా 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ గ్రూపు ఇతర స్కూల్స్‌లో కూడా ఇలాంటి నకిలీ ఎన్సీసీ క్యాంపులు నిర్వహించిందా? అన్నది దర్యాప్తు చేస్తున్నారు.