అహ్మదాబాద్: గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో ఓ యువతి దారుణంగా పరువు హత్యకు గురైంది. అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ సుమన్ నల తెలిపిన వివరాల ప్రకారం, చంద్రిక చౌదరి (18) డాంటియాలోని తన ఇంట్లో హత్యకు గురైంది. ఆమెను ఆమె తండ్రి సెదభాయ్ పటేల్, అంకుల్ శివభాయ్ పటేల్ హత్య చేసినట్లు కేసు నమోదైంది. ఈ కేసులో తండ్రి పరారీలో ఉండగా, ఇద్దరిని అరెస్ట్ చేశారు. హరీశ్ చౌదరితో మృతురాలు చంద్రిక ప్రేమలో పడింది. ఈ వ్యవహారాన్ని ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. తాను వారిని ఒప్పించలేనని గ్రహించిన చంద్రిక జూన్ 24న రాత్రి హరీశ్‌కు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ ఇచ్చింది. తన కుటుంబం నుంచి తనను తీసుకెళ్లిపోవాలని కోరింది. “నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్లు. లేదంటే మావాళ్లు నాకు వేరొకరితో ఇష్టం లేని పెళ్లి చేసేస్తారు. నేను ఆ పెళ్లికి అంగీకరించకపోతే, నన్ను చంపేస్తారు.. కాపాడు” అని పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే మరణించింది.
చంద్రిక గతంలో హరీశ్‌తో కలిసి వెళ్లిపోయింది. వారిని పోలీసులు గుర్తించి, ఆమెను తిరిగి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. తనను కాపాడమని చంద్రిక పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌ను చూసిన తర్వాత హరీశ్ కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. దానిపై విచారణ జరగడానికి ముందే ఆమె మరణించినట్లు అతనికి తెలిసింది. చంద్రిక సహజ పరిస్థితుల్లోనే మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. మరణ ధ్రువీకరణ పత్రాన్ని కూడా కోర్టుకు సమర్పించారు. చంద్రికను ఆమె తల్లిదండ్రులే హత్య చేశారని హరీశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
చంద్రిక తండ్రి, అంకుల్ ఆమెను జూన్ 24న రాత్రి హత్య చేయడానికి పథకం పన్నినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆమెకు మత్తుమందు ఇచ్చి, నిద్రపోయిన తర్వాత గొంతు నులిమి చంపేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించి, ఆదరాబాదరాగా అంత్యక్రియలు జరిపించేశారు. పాలన్‌పూర్‌లో చదువుకుంటున్న ఆమె సోదరుడిని సైతం అంత్యక్రియలకు పిలవలేదు.