రాయ్పూర్: బీజేపీ ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి పనులను దెయ్యాలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. (Ghost Obstruction) ఈ నేపథ్యంలో వాటి నివారణకు నిమ్మకాయలు కొయ్యాలని అన్నారు. ఆ ఎంపీ వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలోని మూఢనమ్మకాలపై చర్చకు దారి తీసింది. బీజేపీ పాలిత ఛత్తీస్గఢ్లో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 15న సుక్మా జిల్లా ఎట్కల్ గ్రామంలో చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో పోలీస్ కానిస్టేబుల్ మౌసం బుచ్చా, అతడి కుటుంబ సభ్యులు హత్యకు గురయ్యారు. సెప్టెంబర్12న బలోదాబజార్ -భటపరాలో, మంత్రతంత్రాల అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని హత్య చేశారు. అక్టోబరు 5న రాయ్పూర్ సమీపంలోని నిన్వా గ్రామంలో 55 ఏళ్ల భువనేశ్వర్ యాదవ్ స్థానిక గుడిలో మెడ కోసుకుని ఆత్మబలిదానానికి పాల్పడ్డాడు.
కాగా, 2020 నుంచి 2024 వరకు ఛత్తీస్గఢ్లో చేతబడులు వంటి మూఢనమ్మకాల వల్ల 54 హత్యలు జరిగాయి. ప్రతిఏటా 200కుపైగా ఇలాంటి హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాంకేర్ లోక్సభ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో ఎంపీ భోజరాజ్ నాగ్ మాట్లాడారు. జల్ జీవన్ మిషన్తో సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు అడ్డంకులు కలుగుతున్నాయని తెలిపారు. అభివృద్ధి పనులను దెయ్యాలు అడ్డుకుంటున్నాయని అన్నారు. నిర్లక్ష్యం వహించిన వారు మాట వినకపోతే వారి పేరుతో నిమ్మకాయ కోస్తానని ఆయన హెచ్చరించారు. దీంతో మూఢనమ్మకాల పరంగా బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షమైన కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.