Ghaziabad : ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో సూర్యప్రతాప్ చౌహాన్ అనే యువకుడు బక్రీద్ సందర్భంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు అసద్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఈ హత్యలో ప్రధాన నిందితులుగా ఉన్న మరో ఇద్దరు నిందితులు ఫర్హాన్, అతీఫ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే అసద్ తండ్రి నవాబ్‌ను కూడా అరెస్ట్ చేశారు. నిందితులు పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు అసద్, ఫర్హాన్, అతీఫ్, మృతుడు సూర్యప్రతాప్ చాలాకాలంగా స్నేహితులు. వీరికి ఒక బైక్ రైడింగ్ విషయంలో గొడవ జరిగింది. ఈ విషయం ప్రధాన నిందితుడైన అసద్ తన తండ్రి నవాబ్కు, స్నేహితులకు చెప్పాడు. దీంతో నవాబ్.. ఎలాగైనా సూర్యప్రతాప్కు గుణపాఠం చెప్పాలని తన కొడుకుకు చెప్పాడు. దీంతో అసద్ తన స్నేహితులతో కలిసి ఒక ప్రణాళిక రచించాడు. అసద్‌కు ఫర్హాన్ ఒక కత్తిని అందించాడు. అనంతరం వాడిని ఈరోజు అంతం చెయ్యు అంటూ తండ్రి నవాబ్ కూడా రెచ్చగొట్టాడు. దీంతో వారంత కలిసి సూర్యప్రతాప్‌ను చుట్టుముట్టారు. సూర్యను అసద్ కత్తితో పొడిచాడు.
తను తప్పించుకోవడానికి ప్రయత్నించినా అసద్ అతడిని పొడిచి చంపాడు. తండ్రి రెచ్చగొట్టడం వల్లే ఆగ్రహంతో ఉన్న అసద్, తన స్నేహితులతో కలిసి సూర్యప్రతాప్‌ను హత్య చేశాడు. అసద్ ఎన్కౌంటర్లో మరణించాడు. హత్య అనంతరం తప్పించుకుపోయిన అతడి కోసం పోలీసులు గాలిస్తుండగా, శనివారం రాత్రి అతడి ఆచూకీ లభించింది. ఈ క్రమంలో పోలీసులు అసద్‌ను లొంగిపోవాలిన కోరినప్పటికీ వినిపించుకోకుండా పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అసద్ గాయపడగా, ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. అసద్ అంత్యక్రియలు ఆదివారం నిర్వహించినట్లు తెలుస్తోంది.