ఎల్బీనగర్, జూలై 25: రేవంత్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలతో నోటిఫికేషన్ విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి , రేవంత్ సీఎం కావడానికి నిరుద్యోగ సమస్యే కారణమని, ఆనాడు రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామంటూ ఇచ్చిన హామీలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు.
రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు భర్తీ చేయకుండా తాత్సరం చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పదవీవిరమణలతో అనేక శాఖల్లో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నా.. వాటిని భర్తీ చేయడం లేదని విమర్శించారు. కొత్త జిల్లాలు, కొత్త ఆఫీసులు, కొత్త మండలాల్లో అదనపు పోస్టులు సృష్టించడం లేదని, భర్తీ చేయడం లేదని ఆరోపించారు. పోలీస్ శాఖలో 18 వేలకుపైగా ఖాళీలు ఉన్నట్టు పోలీస్ విభాగం బాస్‌లే చెప్పినా.. వాటిని భర్తీ చేయకుండా సీఎం రేవంత్ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అంటూ నమ్మబలికి ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వడం లేదని విమర్శించారు. నిరసనలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు అనంతయ్య, విద్యార్థి సంఘం కన్వీనర్ పరగోర్ల మోడీ రాందేవ్ యాదవ్, నిరుద్యోగ జేఏసీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.