(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ఐదు రాష్ర్టాల ఎన్నికలకు సంబంధించి గత బుధవారం పలు ఏజెన్సీలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా నిజమయ్యాయి. బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరికి సంబంధించి సోమవారం వెల్లడైన ఫలితాలతో ఇది రుజువైంది. అయితే, తమిళనాడులో మాత్రం యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ మినహా మిగతా అన్ని ఏజెన్సీల అంచనాలు తారుమారుకావడం గమనార్హం. యాక్సిస్ మై ఇండియా సంస్థ మాత్రమే తమిళనాడులో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని అంచనా వేసింది. ఆ అంచనాలకు తగ్గట్టే ఫలితాలు వెలువడ్డాయి.
పశ్చిమ బెంగాల్లో 200కు పైగా సీట్లను బీజేపీ గెలుచుకొంటుందని ప్రజాపోల్ ఎనలటిక్స్ సర్వే సంస్థ వేసిన అంచనాలు నిజమయ్యాయి. పుదుచ్చేరిలోనూ ఎన్నార్ కాంగ్రెస్ నేతృత్వంలోని బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని ఈ సంస్థ అంచనా వేసింది. అందుకు అనుగుణంగానే ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే సంస్థ అంచనా వేసినట్టుగానే ఆయా పార్టీలకు ఓట్లు రావడం గమనార్హం.