(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆప్త మిత్రుడంటూ ప్రతిపక్షాలు విమర్శించే ప్రపంచ కుబేరుడు గౌతమ్ అదానీ కంపెనీ కోసం సరిహద్దు నిబంధనలను కేంద్రప్రభుత్వం సవరించిందా? అదానీ డ్రీమ్ ప్రాజెక్టు కోసమని, ఆయనకు లబ్ధి చేకూర్చడానికి దేశ భద్రతను గాలిలో దీపంగా మార్చేసిందా? బ్రిటిష్ పత్రిక ‘ది గార్డియన్’లో బుధవారం ప్రచురితమైన ఓ కథనం ఈ అనుమానాలకు తావిస్తున్నది.
పునరుత్పాదక శక్తి రంగంలో విస్తరించాలనుకొంటున్న అదానీ గ్రూప్ గుజరాత్‌లోని ఖావ్డాలో సౌర, పవన విద్యుత్తు ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. 2020లో దీన్ని ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించారు. అయితే, ఈ ప్లాంట్‌ను మరింతగా విస్తరించడానికి అదానీ గ్రూప్ ప్రణాళికలను సిద్ధం చేసినప్పటికీ, విస్తరణకు అవసరమైన రాణ్ ఆఫ్ కచ్‌లోని భూములు పాకిస్థాన్ సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉండటంతో అది సాధ్యపడట్లేదు. సరిహద్దు నిబంధనల ప్రకారం.. అంతర్జాతీయ సరిహద్దులకు 10 కిలోమీటర్ల దూరంలోపు ఎలాంటి వాణిజ్య నిర్మాణాలు చేపట్టకూడదు. అయితే, 2023 ఏప్రిల్, మేలో రెండుసార్లు ఢిల్లీలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశాల్లో సరిహద్దుల్లోని నిబంధనలను కేంద్రం ఏకపక్షంగా మార్చివేసింది. అలాగే, రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలోని 230 చదరపు కిలోమీటర్ల భూములను తొలుత సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ)కు.. అనంతరం ఎస్ఈసీఐ నుంచి ఈ భూములను ఆగస్టు, 2023లో అదానీ కంపెనీకి కట్టబెట్టింది. ఈ మేరకు ‘గార్డియన్’ పత్రిక తన సంచలన కథనంలో ఆరోపించింది. ఒక్క పాక్ సరిహద్దుల్లోనే కాకుండా బంగ్లాదేశ్, చైనా, మయన్మార్, నేపాల్ సరిహద్దుల విషయంలోనూ కొత్త నిబంధనలు పాటించాలని కేంద్రం ఆదేశించినట్టు గార్డియన్ పత్రిక వివరించింది. గతంలో సరిహద్దుల నుంచి కనీసం 10 కిలోమీటర్ల పరిధిలో కూడా నిర్మాణాలను చేపట్టని అదానీ కంపెనీ.. కొత్త నిబంధనలు అమల్లోకి రావడంతో.. పాకిస్థాన్ సరిహద్దుకు కేవలంకిలోమీటర్ దూరంలోనే ఇప్పుడు అదానీ కంపెనీ సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్స్‌ను తయారు చేస్తున్నట్టు పత్రిక పేర్కొంది.
రాణ్ ఆఫ్ కచ్ భూములను అదానీ కంపెనీకి కట్టబెట్టే నిర్ణయం తీసుకొన్నప్పుడు ఆ ప్రాంతంలో పర్యవేక్షణ బాధ్యతలు చూసుకొంటున్న సీనియర్ ఆర్మీ అధికారులను కూడా కేంద్రం ఎంతమాత్రం సంప్రదించలేదని గార్డియన్ ఆరోపించింది. ఇండియా-పాకిస్థాన్ మధ్య ఘర్షణలు జరిగినప్పుడు గతంలో శత్రుదేశం తొలుత రాణ్ ఆఫ్ కచ్‌లోని సిర్ క్రీక్ ప్రాంతం మీదనే నాలుగుసార్లు దాడి చేసిందని రక్షణ రంగ నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో పాకిస్థాన్‌తో ఘర్షణ వాతావరణం ఏర్పడితే అదానీ కంపెనీ వాణిజ్య కార్యకలాపాలు చేపడుతున్న రాణ్ ఆఫ్ కచ్‌లోకి మన ఆర్మీ యుద్ధ ట్యాంకులను ఎలా తరలించగలదని ప్రశ్నిస్తున్నారు. సైన్యం పెట్రోలింగ్‌కు కొత్త ఇబ్బందులు తలెత్తవచ్చని చెప్తున్నారు. కేంద్రం తాజా నిర్ణయం దేశ భద్రతకు ఎంతో నష్టదాయకమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ది గార్డియన్’ కథనంపై కేంద్రం స్పందించాల్సి ఉన్నది.
దేశ భద్రతకు వ్యూహాత్మకమైన సరిహద్దుల్లోని భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం అవివేకమైన చర్య. శత్రుదేశానికి చెందిన చొరబాటుదారులు మన దేశంలోకి ప్రవేశిస్తే వాళ్లను ఇప్పుడు ఎలా ఎదుర్కోగలం? ప్రైవేటు వ్యక్తుల లాభం కోసం ఆలోచిస్తే.. ఇప్పుడు ఆర్మీపై మరింత ఒత్తిడి పడినట్లయ్యింది.