న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతం అదానీ(Gautam Adani) కంపెనీలపై మళ్లీ అమెరికా ప్రాసిక్యూటర్లు ఫోకస్ పెట్టారు. ఇరాన్‌కు చెందిన ద్రవరూప పెట్రోలియం వాయువును గుజరాత్‌లోని ముంద్రా ఎయిర్‌పోర్టుకు అదానీ కంపెనీ తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై వాల్ స్ట్రీట్ జర్నల్ సోమవారం ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే ఆ ఆరోపణలను అదానీ గ్రూపు కొట్టిపారేసింది. ఇరానీ ఎల్పీజీతో తమ సంస్థలకు ఎటువంటి లింకు లేదని అదానీ గ్రూపు స్పష్టం చేసింది. అవి నిరాధార ఆరోపణలు అని పేర్కొన్నది.
ఇరాన్ గల్ప్ నుంచి ముంద్రా పోర్టు వరకు ట్యాంకర్లు ప్రయాణించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొన్నది. అనేక ఎల్పీజీ ట్యాంకర్లను కార్గోలుగా వాడి అదానీ కంపెనీకి తరలించినట్లు నమోదు అయిన ఆరోపణలపై అమెరికా న్యాయ శాఖ సమీక్ష చేపట్టింది. తమ పోర్టుల వద్దకు ఇరాన్ కానీ, ఇరాన్ సంబంధిత నౌక ద్వారా తమకు కార్గోలు రాలేదని అదానీ గ్రూపు చెప్పింది. కావాలని ఆంక్షల ఉల్లంఘన జరగలేదని అదానీ సంస్థ పేర్కొన్నది. అమెరికా అధికారులు ఈ కేసులో ఎటువంటి విచారణ చేపట్టడం లేదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మే నెలలో కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఇరానీ ఇంధనాన్ని లేదా పెట్రోకెమికల్ ఉత్పత్తులను ఖరీదు చేయడాన్ని ఆపేయాలన్నారు. ఒకవేళ ఎవరైనా ఆ దేశం నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేస్తే వాళ్లపై ఆంక్షలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు.