న్యూఢిల్లీ: ఫెడరల్ సెక్యూరిటీల ఉల్లంఘన కేసులో భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి భారతీయ అధికారులు ఇప్పటి వరకు సమన్లు జారీచేయలేదని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్(ఎస్ఈసీ).. న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టుకు తెలియచేసింది. న్యూయార్క్ కోర్టు ఎదుట అమెరికా ఎస్ఈసీ దాఖలు చేసిన స్టేటస్ రిపోర్టును ఓ జాతీయ మీడియా సంపాదించింది.
ఈ స్టేటస్ రిపోర్టు ప్రకారం గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీకి సమన్లు జారీచేయడానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎస్ఈసీ భారత ప్రభుత్వ సహాయాన్ని కోరింది. నాలుగు నెలలు అవుతున్నా వారికి సమన్లు మాత్రం ఇప్పటివరకు జారీచేయలేదు. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌కి సంబంధించి మోసపూరిత, తప్పుదారి పట్టించే ప్రకటనలతో ఫెడరల్ సెక్యూరిటీస్ చట్టాలను ఉల్లంఘించారన్న ఆరోపణలతో గౌతమ్ అదానీ, సాగర్ అదానీలపై కేసు నమోదైంది. ఈ ఆరోపణలను దర్యాప్తు చేసి ప్రాసిక్యూట్ చేసేందుకు ఎస్ఈసీ చర్యలు చేపట్టింది.