‘సావన్ (వానకాలం) మాసంలో మీ అన్న మీకు రాఖీ కానుకగా రూ.450కే గ్యాస్ సిలిండర్ అందిస్తాడు. ఆ తర్వాత భవిష్యత్తులోనూ ఈ ధరకే అందించేలా ఏర్పాటు చేస్తాను. ఖరీదైన గ్యాస్ వల్ల ఇబ్బందులు లేకుండా శాశ్వత ఏర్పాట్లు చేస్తాను’
-27ఆగస్టు 2023న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని ముందస్తుగా నిర్వహించిన సభలో వేలాది మంది అక్కచెల్లెమ్మల సాక్షిగా ఇచ్చిన హామీ ఇది.
‘గ్యాస్ సిలిండర్‌ను రూ.450కు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. సిలిండర్ లేదు..ఏమీ లేదు పోండి’
– రాఖీ పౌర్ణమి సందర్భంగా తమ అన్న శివరాజ్ సింగ్ చౌహాన్ ఇస్తానన్న రూ.450కి గ్యాస్ సిలిండర్ బహుమతి అందుకుందామని ఏజెన్సీలకు వెళ్లిన మహిళలకు ఎదురైన ఈసడింపులు ఇవీ.
Shivraj Singh Chouhan | భోపాల్, ఆగస్టు 31: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బూటకపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్న మధ్యప్రదేశ్‌లోని బీజేపీ సర్కారు నిర్వాకం మరోసారి బయటపడింది. సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ రాఖీ పర్వదినం రోజునే అక్కచెల్లెమ్మలను నమ్మించి మోసం చేయడమే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నది. రాఖీ సందర్భంగా తన సోదరీమణులకు రూ.450కే గ్యాస్ సిలిండర్‌ను అందిస్తున్నానంటూ.. ఊదరగొట్టిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారు. గ్యాస్ నింపుకుందామని ఏజెన్సీల ముందు బారులుతీరిన అక్కచెల్లెమ్మలకు మొండిచెయ్యి చూపారు.
ఆర్భాటంగా ప్రకటన
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో బీజేపీ సర్కార్ మోసపూరిత వాగ్దానాలకు తెరలేపింది. సీఎం మాటలు నమ్మి ఖాళీ వంటగ్యాస్ సిలిండర్లతో గ్యాస్ ఏజెన్సీలకు వెళ్లిన వేలాది మంది మహిళలు షాక్‌కు గురయ్యారు. రూ.450కు ఇస్తామని చెప్పి రప్పించారు.. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత రూ.1185 వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సిలిండర్ లేదు..ఏమీ లేదు పోండి’అంటూ తమను వెళ్లగొడుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రంలో సబ్సిడీతో కూడిన వంటగ్యాస్ సిలిండర్‌ను రూ.450కి అందజేస్తామని, దీనిని వెంటనే అమల్లోకి తెస్తామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గత ఆదివారం ప్రకటించారు. ఆర్భాటంగా ప్రకటించేసి.. ఆపైన చేతులు దులుపుకున్నారు. ఆయన మాటలు నమ్మి గ్యాస్ ఏజెన్సీ ఆఫీసులకు వెళ్తున్న మహిళలు అవమానానికి గురవుతున్నారు.
ప్రభుత్వం మోసం చేసింది
ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం తీవ్ర దుమారం రేపింది. ప్రభుత్వం తమను మోసం చేసిందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సిలిండర్ ధర పెరిగిందని ఆందోళన చెందకండి. శ్రావణ మాసంలో రూ.450కే మీకు అందుబాటులోకి వస్తుంది. వంటగ్యాస్ ధరల బెడదను శాశ్వతంగా దూరం చేస్తాను’ అని సీఎం చేసిన వాగ్దానం క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదు. శివపురి జిల్లాకి చెందిన ఓ మహిళ సీమా మాట్లాడుతూ, ‘రక్షా బంధన్ కానుకంటూ ప్రభుత్వం మోసం చేసింది. సీఎం ప్రకటన చూసి..ఆన్లైన్లో సిలిండర్ బుక్ చేశాం. రూ.450 కాకుండా.. రూ.1185 వసూలు చేశారు’ అంటూ వాపోయారు.