కాన్పూర్, సెప్టెంబర్ 9: యూపీలో భివాండి-ప్రయాగ్‌రాజ్ కాళిందీ ఎక్స్‌ప్రెస్‌కు కాన్పూర్‌లో పెను ప్రమాదం తప్పింది. ట్రాక్‌పై ఉంచిన గ్యాస్ సిలిండర్‌ను రైలు ఢీకొంది. అయితే రైలుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. రైలును పట్టాలు తప్పించడానికి జరిగిన విద్రోహ చర్యగా దీనిని భావిస్తున్నామని, ఘటనా స్థలిలో ఒక పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టెను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి 8.20 గంటలకు రైలు అతివేగంతో వెళ్తుండగా, పట్టాలపై ఎల్పీజీ సిలిండర్ ఉండటాన్ని గమనించిన లోకో పైలెట్ ఎమర్జెన్సీ బ్రేకులు ప్రయోగించారు. అయినప్పటికీ రైలు సిలిండర్‌ను ఢీకొనడంతో అది పట్టాలకు దూరంగా ఎగిరిపడింది. ఘటనపై కేసు నమోదైందని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీస్ అధికారి చెప్పారు.