న్యూఢిల్లీ, జూలై 6: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి మరోసారి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు, బూస్టర్ డోసు మధ్య కాలవ్యవధిని ఆరు నెలలకు తగ్గించింది. ఇప్పటి వరకు ఇది తొమ్మిది నెలలుగా ఉన్నది. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్(ఎన్టీఏజీఐ) కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ర్టాలు, యూటీలకు బుధవారం రాసిన లేఖలో పేర్కొన్నారు. వ్యాక్సిన్ రెండో డోసు తీసుకొని ఆరు నెలలు లేదా 26 వారాలు పూర్తయిన 18-59 ఏండ్ల మధ్య వయసు గలవారు ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల్లో బూస్టర్ డోసు తీసుకోవచ్చని రాజేష్ భూషణ్ పేర్కొన్నారు. అదేవిధంగా 60 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసుగల వారు, హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లలో ఉచితంగా బూస్టర్ డోసు ఇస్తారని తెలిపారు.
దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బూస్టర్ పాలసీని మార్చాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం సరిగా లేదని పేర్కొంటున్నారు. బూస్టర్ డోసుగా వాడేందుకు కార్బివాక్స్ టీకాకు అనుమతించినప్పటికీ, ఇప్పటికీ బూస్టర్ డోసుగా తొలి రెండు డోసులు వేసుకున్న టీకానే వాడుతున్నారని చెబుతున్నారు. కొవాగ్జిన్ తీసుకున్న తర్వాత కొవిషీల్డ్ తీసుకుంటే ఇమ్యూనిటీ మరింత పెరుగుతుందని వెల్లూర్ క్రిస్టియన్ మెడికల్ కాలేజీ అధ్యయనంలో తేలిందని, అయినప్పటికీ దేశంలో కొవాగ్జిన్‌నే మూడో డోసుగా ఇస్తున్నారని వైరాలజిస్ట్ షాహిద్ జమీల్ గుర్తుచేశారు.