డెహ్రాడూన్ : చార్ధామ్ యాత్ర బుధవారం ప్రారంభమైంది. గర్వాల్ హిమాలయాల్లోని గంగోత్రి, యమునోత్రి దేవాలయాలను అక్షయ తృతీయ సందర్భంగా తెరిచారు. భక్తులు గంగా మాత, యమునా మాతలను దర్శించుకున్నారు. చార్ధామ్ యాత్రలో, కేదార్నాథ్ దేవాలయాన్ని మే 2న, బద్రీనాథ్ దేవాలయాన్ని మే 4న తెరుస్తారు. శీతాకాలంలో ఈ నాలుగు దేవాలయాలను మూసివేస్తారు. భక్తుల భద్రత కోసం యాత్ర మార్గాల్లో దాదాపు 6,000 మంది పోలీసులు, 17 కంపెనీల ప్రొవిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ సిబ్బంది, 10 కంపెనీల పారామిలిటరీ దళాలను మోహరించారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న 65కుపైగా ప్రాంతాల్లో రాష్ట్ర విపత్తు స్పందన దళ సిబ్బందిని మోహరించారు.