లక్నో : బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో దారుణం జరిగింది. ఈ నెల 2న రాత్రి ఆరేండ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి, ఇంటి పై కప్పు నుంచి కిందకు విసిరేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆమె కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించారు. ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
నిందితులిద్దరూ బాధితురాలి కుటుంబం నివసిస్తున్న భవనంలోనే అద్దెకు ఉంటున్నారు. దారుణానికి పాల్పడిన తర్వాత పారిపోయిన నిందితులను పట్టుకోవడం కోసం పోలీసు బృందాలు గాలించాయి. కాలనీలో వీరు ఓ చోట దాక్కున్న ట్లు సమాచారం అందటంతో పోలీసులు అక్కడికి వెళ్లగా, నిందితులు వారిపై కాల్పులు జరిపారు. పోలీసులు నిందితుల కాళ్లపై కాల్పులు జరిపి వారిని అరెస్ట్ చేశారు. ప్రాథమిక దర్యాప్తులో తాము నేరం చేసినట్లు నిందితులు అంగీకరించారు.