న్యూఢిల్లీ, నవంబర్ 14: సామూహిక అత్యాచారానికి గురైన ఓ బాధితురాలు పోలీసు వలయాన్ని ఛేదించుకుని డీఐజీని కలుసుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అర్థించింది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. డీఐజీని కలుసుకునేందుకు పోలీసు స్టేషన్‌కు చేరుకున్న బాధితురాలిని పోలీసులు అడ్డుకున్నారు.
వారిని విదిలించుకుని ముందుకు దూసుకువెళ్లిన బాధితురాలు నేరుగా డీఐజీని కలుసుకుని తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఆరుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిని జైలుకు పంపించారు. మిగిలిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆమె డీఐజీని కోరారు. పరారీలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకునేందుకు అన్ని చర్యలు చేపట్టామని, ఆ ఇద్దరిని కూడా అరెస్టు చేసి న్యాయం చేస్తామని ఆయన హామీనిచ్చారు.