లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉండటంతో మెల్లమెల్లగా రాజకీయ వేడి రాజుకుంటున్నది. పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు మొదలయ్యాయి. ఇటీవల సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క అసెంబ్లీ స్థానం కూడా దక్కదని వ్యాఖ్యానించారు. అఖిలేష్ వ్యాఖ్యలకు ఇవాళ కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ వాద్రా కౌంటర్ ఇచ్చారు.
అఖిలేష్ యాదవ్ జ్యోతిస్కుడేమో..! అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క అసెంబ్లీ స్థానం కూడా దక్కదని ఆయన జ్యోష్యం చెప్పారు. కానీ వాస్తవానికి ఏం జరుగనుందో మనం చూస్తాం అని ఆమె వ్యాఖ్యానించారు. యూపీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తలతో ఇప్పటివరకు రెండు సమావేశాలు ముగిశాయన్నారు. అంతేగాక యూపీలో మహిళల సంక్షేమానికి సంబంధించి త్వరలో ఒక ప్రత్యేకమైన పబ్లిక్ డిక్లరేషన్ నోటిస్ను ప్రకటించనున్నామని ప్రియాంకాగాంధీ చెప్పారు.