బెంగళూరు: కర్ణాటకకు చెందిన మైనింగ్ వ్యాపారి, బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి (Gali Janardhan Reddy) శాసనసభ సభ్యత్వం రద్దయింది. అనంతపురం జిల్లా ఓబుళాపురం అక్రమ మైనింగ్ (OMC) కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టు ఆయనను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. గాలి జనార్దన్ రెడ్డి సహా ఐదుగురికి ఏడేండ్ల జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఆయన శాసనసభ సభ్యత్వం రద్దు చేస్తూ కర్ణాటక అసెంబ్లీ ప్రకటించింది. ఈ మేరకు కర్ణాటక విధాన సభ కార్యదర్శి ఎంకే విశాలాక్షి ఉత్తర్వులు జారీ చేసింది.
‘హైదరాబాద్‌లోని సీబీఐ కేసుల ప్రధాన ప్రత్యేక న్యాయమూర్తి కోర్టు, సీసీ నెం.1 ఆఫ్ 2012లో గంగావతి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కర్ణాటక శాసనసభ సభ్యుడు జి. జనార్దన్ రెడ్డిని మే 6న దోషిగా నిర్ధారించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(1)(ఇ), ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 8 నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది శిక్ష పడిన నాటి నుంచే అమలులోకి వస్తుంది. జనార్దన్ రెడ్డికి విధించిన శిక్షపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించకపోతే.. విడుదలైన నాటి నుంచి మరో ఆరేండ్లపాటు అనర్హత కొనసాగుతుంది’ అని అందులో పేర్కొన్నారు. గాలి జనార్దన్ రెడ్డిపై అనర్హత వేటు వేసిన తక్షణమే అసెంబ్లీలో ఒక స్థానం ఖాళీ అయ్యిందంటూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఓఎంసీ కేసులు ప్రధాన నిందితుడిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. దీంతో గంగావతి నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. అయితే ఓబుళాపుంర కేసులో ఓఎంసీ కంపెనీ, బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, వీడీ రాజగోపాల్, కె.మెఫజ్ అలీఖాన్‌ను హైదరాబాద్ సీబీఐ కోర్టు దోషులుగా తేల్చింది. గాలి జనార్దన్ రెడ్డి సహా ఐదుగురికి ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. అలాగే ఒక లక్ష రూపాయల జరిమానా విధించింది.
ఓఎంసీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్‌పై 2009లో నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. 2011లో మొదటి ఛార్జిషీట్ దాఖలు చేసింది. అనంతరం ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ, గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మెఫజ్ అలీఖాన్, అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిందితులుగా చేర్చింది. మొత్తంగా ఈ కేసులో 9 మందిని నిందితులుగా చేర్చింది. ఏ1గా బీవీ శ్రీనివాసరెడ్డి, ఏ2గా గాలి జనార్దన్ రెడ్డి, ఏ3గా గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వీడీ రాజగోపాల్, ఏ4గా ఓఎంసీ మైనింగ్ కంపెనీ, ఏ5గా లింగారెడ్డి, ఏ6 ఐఏఎస్ శ్రీలక్ష్మీ, ఏ7గా మెఫజ్ అలీఖాన్, ఏ8గా మాజీ ఐఏఎస్ కృపానందం, ఏ9గా సబితా ఇంద్రారెడ్డి పేర్లను చేర్చింది. ఈ కేసులో భాగంగా నాంపల్లి సీబీఐ కోర్టు 219 మంది సాక్షులను విచారించింది. 3400 పత్రాలను పరిశీలించింది.