Nitin Gadkari | రోడ్ల నిర్మాణంలో 35శాతం వరకు బయో బిటుమెన్ మిశ్రయం ఉపయోగించనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దాంతో ప్రభుత్వం రూ.10వేలకోట్ల వరకు ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. పెట్రోలియం ఆధారిత బిటుమెన్‌లో 35శాతం వరకు లిగ్నిన్‌ను కలిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందని.. ఇందులో ఎక్కువ భాగం ఇతరదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. బిటుమెన్ అనేది ముడి చమురు నుంచి వెలువడిన నల్లటి పదార్థం. రోడ్లతో పాటు పైకప్పులను నిర్మించేందుకు విస్తృతంగా ఉపయోగిస్తారు. రాజ్యసభలో ఓ ప్రశ్నకు గడ్కరీ సమాధానం ఇస్తూ.. ప్రపంచంలోనే అతిపెద్ద రోడ్ నెట్వర్క్ భారత్‌ది అని తెలిపారు. 90శాతం వరకు బిటుమెన్ వినియోగిస్తున్నట్లు తెలిపారు.
2023-24లో 88 లక్షల టన్నుల వినియోగం ఉందని.. 2024-25లో 50శాతం వరకు దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. వార్షిక దిగుమతి నుంచి రూ.25వేల నుంచి రూ.30వేల కోట్లు ఉంటుందని చెప్పారు. రైతులు ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయడంతో పాటు ఇంధన ఉత్పత్తిదారులుగా మారుతున్నారని తెలిపారు. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CRRI), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం డెహ్రాడన్ వరిగడ్డి నుంచి బయో బిట్మిట్ను అభివృద్ధి చేశాయని చెప్పారు. వరిగడ్డిని దహనం చేస్తుండడంతో ఢిల్లీలో వాయు కాలుష్యం ఇబ్బందికరంగా మారుతుందన్నారు. టన్ను వరిగడ్డి పొట్టు నుంచి 30శాతం వరకు బయో బిటుమెన్, 350 కిలోల బయో గ్యాస్ వస్తుందన్నారు. బయో బిటుమెన్‌ను తారుగా మార్చడం విజయవంతమైందన్నారు. దాంతో రూ.10వేలకోట్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందన్నారు. పేటెంట్ కోసం ఇప్పటికే దరఖాస్తును సమర్పించామన్నారు. పెట్రోలియం ఆధారిత తారు కిలో రూ.50 పలుకుతుందన్నారు. బయో మాస్‌తో తయారు చేసిన బిటుమెన్ ధర కిలో రూ.40కే వస్తుందన్నారు.
పానిపట్‌లో వరి గడ్డితో రోజుకు లక్ష లీటర్ల ఇథనాల్‌ను తయారు చేసే ప్రాజెక్ట్‌ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు ఉందని తెలిపారు. రోజుకు 150 టన్నుల బయో బిటుమెన్, సంవత్సరానికి 88వేల టన్నుల బయో ఏవియేషన్ ఇంధనం సైతం తయారు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మనకు 450 ప్రాజెక్టులు ఉన్నాయని.. గడ్డిని బయో సీఎన్జీగా మారుతున్నామని.. లిగ్నిన్‌ను సైతం పొందుతున్నామన్నారు. ఈ 450 ప్రాజెక్టులు హర్యానా, పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయని.. ఇక్కడ బయోమాస్ (స్టబుల్) బయో-సీఎన్జీగా మారుస్తుందని.. లిగ్నిన్ లభిస్తుందన్నారు. దాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆర్డర్లు సైతం ఇస్తున్నామన్నారు. దిగుమతులను తగ్గించడంతో పాటు వాయు కాలుష్య సమస్యను సైతం పరిష్కరించబోతుందన్నారు. రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చాలా పర్యావరణ అనుకూల నిర్ణయాలు తీసుకుందని.. ఫ్లై యాష్‌ని సైతం వినియోగిస్తున్నట్లు తెలిపారు.