కాంగ్రెస్ అసమ్మతి నేతలు, జీ 23 గ్రూపుగా ముద్రపడ్డ నేతలు కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఇంట్లో భేటీ అయ్యారు. వారంలోనే ఇలా భేటీ కావడం ఇది రెండో సారి. సీడబ్ల్యూసీ భేటీ, ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను రాజీనామా చేయాలని సోనియా ఆదేశించిన తర్వాత ఈ భేటీ జరుగుతోంది. మొదట్లో కపిల్ సిబాల్ ఇంట్లో భేటీ కావాలని అందరూ నిర్ణయించారు. ఏం జరిగిందో కానీ.. ఈ భేటీ గులాంనబీ ఆజాద్ ఇంటికి మారింది. ఆనంద్ శర్మ, కపిల్ సిబాల్, గులానంబీ ఆజాద్, మనీశ్ తివారీ, భూపేందర్ హుడా, పృథ్వీరాజ్ చవాన్, కురియన్, మణిశంకర్ అయ్యర్ తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు.
పార్టీలో నాయకత్వ మార్పునకు సమయం ఆసన్నమైందని, అధ్యక్ష పదవిని గాంధీలు వేరొకరికి బదిలీ చేయాలని సీనియర్ నేత కపిల్ సిబల్ తేల్చిచెప్పారు. అధ్యక్ష పదవిలో లేనప్పటికీ, రాహుల్ అధికారాన్ని చెలాయిస్తున్నారని మండిపడ్డారు. సిబల్ వ్యాఖ్యలకు మరోనేత సందీప్ దీక్షిత్ మద్దతు పలికారు. అయితే, పార్టీపై విమర్శలను సోనియా విధేయులు తిప్పికొట్టారు. ఎంపీ సీట్లు కావాలనుకొంటే బీజేపీలో చేరొచ్చని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో కాంగ్రెస్లో తలెత్తిన సంక్షోభం ముదిరిపాకాన పడినట్లయింది.