న్యూఢిల్లీ, ఏప్రిల్ 9 : అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పదం కుదిరినప్పటికీ.. దేశీయంగా ఇంధన కొరతపై ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పురీ, విదేశాంగ మంత్రి జైశంకర్ గల్ఫ్ దేశాల పర్యటనకు సిద్ధమయ్యారు. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పురీ ఖతార్లో పర్యటిస్తున్నారని తెలిసింది.
గురు, శుక్రవారాల్లో ఆయన ఖతార్లో అక్కడి ముఖ్య అధికారులతో మంతనాలు జరుపుతారని వార్తలు వెలువడ్డాయి. ఇరాన్ ప్రతీకార దాడుల నేపథ్యంలో ఎల్ఎన్జీ ఉత్పత్తి, ఎగుమతులను ఖతార్ అధికారులు నిలిపివేశారు. తాజా కాల్పుల విరమణ ఒప్పందం కుదరటంతో ఉత్పత్తులను మళ్లీ ప్రారంభించాలని అక్కడి అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. విదేశాంగ మంత్రి జైశంకర్ దుబాయ్లో పర్యటించనున్నారు. ఈనెల 11-12 తేదీల్లో జైశంకర్ పర్యటన ఉంటుందని విదేశాంగ శాఖ పేర్కొన్నది.