న్యూఢిల్లీ, మే 28 : గడచిన మూడు సంవత్సరాలు నిరాటంకంగా లాభాలను చవిచూసినప్పటికీ కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని మూడు చమురు మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలను వాయిదా పద్ధతిలో పెంచుకుంటూ పోతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో చమురు మార్కెటింగ్ కంపెనీలు రూ. 77,821 కోట్ల ఉమ్మడి నికర లాభాన్ని, దాదాపు రూ. 20 లక్షల కోట్ల టర్నోవర్‌ను నమోదు చేశాయి. వాటి తాజా కార్పొరేట్ ఫలితాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీల లాభాలు గణనీయంగా పుంజుకున్నాయి.
గత ఏడాదితో పోలిస్తే 2026 ఆర్థిక సంవత్సరంలో ఐఓసీ లాభాలు దాదాపు మూడు రెట్లు పెరగగా హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ తమ ఆదాయాలను దాదాపు రెట్టింపు చేసుకున్నాయి. గడచిన మూడేండ్లలో చమురు మార్కెటింగ్ కంపెనీల నికర లాభాలు ఈ ప్రకారం ఉన్నాయి. 2023-24లో ఐఓసీ నికర లాభం రూ. 39,619 కోట్లు ఉండగా 2024-25లో 12.932 కోట్లు ఉంది. 2025-26లో దాని లాభం రూ. 36.802 కోట్లుగా నమోదైంది. బీపీసీఎల్ విషయానికి వస్తే 2023-24లో రూ. 26,673 కోట్లు, 2024-25లో రూ. 13,275 కోట్లు, 2025-26లో రూ. 23,303 కోట్లు ఉన్నాయి. హెచ్‌పీసీఎల్ లాభాలు వరుసగా రూ. 14,694 కోట్లు, రూ. 6,736 కోట్లు, రూ. 18,047 కోట్లుగా నమోదయ్యాయి.
ఈ పరిణామాలు విపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కోగా ప్రభుత్వం మాత్రం ఇటీవలి రిటైల్ ఇంధన ధరల పెంపును సమర్థించుకుంది. పశ్చిమాసియాలో ఫిబ్రవరి చివరిలో సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి భారత్‌లో రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు సుమారు 8-9 శాతం పెరిగాయి. ఓఎంసీ లాభాలలో సుమారు సగం డివిడెండ్లు, పన్నుల ద్వారా ఖజానాకు తిరిగి వస్తాయని, ఇది రహదారులు, రైల్వేలు, మెట్రో ప్రాజెక్టులతోసహా మౌలిక సదుపాయాల నిర్మాణానికి నిధులు సమకూర్చడంలో సహాయపడుతుందని, అదే సమయంలో నిలుపుకున్న ఆదాయాలు ఇంధన భద్రతా పెట్టుబడులు, శుద్ధి విస్తరణకు మద్దతు ఇస్తాయని ప్రభుత్వం వాదించింది.