చెన్నై: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి వల్ల దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ప్రభుత్వ ప్రజా రవాణా సంస్థలు కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా దక్షిణ రైల్వే కొత్త నిబంధన తెచ్చింది. తమిళనాడు రాజధాని చెన్నైలో లోకల్ ట్రైన్లలో ప్రయాణించడానికి టీకా రెండు డోసులు తీసుకోవడం తప్పనిసరి అని తెలిపింది.
పూర్తి టీకాలు తీసుకున్న వారినే చెన్నై లోకల్ రైళ్లలో ప్రయాణానికి అనుమతిస్తామని దక్షిణ రైల్వే శనివారం తెలిపింది. రెండు టీకాలు తీసుకున్నట్లుగా సర్టిఫికేట్ లేని వారికి జర్నీ టికెట్లు అమ్మబోమని చెప్పింది. ఇందులో ఎవరికీ మినహాయింపులేదన్నది. సీజన్ టికెట్లదారులకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. జనవరి 10 నుంచి జనవరి 31 వరకు ఇది అమలులో ఉంటుందని తెలిపింది. అన్‌రిజర్వ్ టికెటింగ్ వ్యవస్థ (యూటీఎస్) మొబైల్ యాప్ ఈ సమయంలో అందుబాటులో ఉండదని వెల్లడించింది.
మరోవైపు తమిళనాడులో శుక్రవారం కొత్తగా 8,981 కరోనా కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 121 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఇందులో 117 మంది కోలుకున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.