BRS | హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ శిక్షణా శిబిరాలు శనివారం విజయవంతంగా ముగిశాయి. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ కన్వీనర్లు, సమన్వయకర్తలు, ముఖ్యనాయకులకు నాందేడ్‌లో బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం శిక్షణా తరగతులను ప్రారంభించిన విషయం తెలిసిందే. పార్టీ నిర్మాణం, గ్రామ గ్రామానికి తెలంగాణ మాడల్‌ను వివరించే ద్విలక్ష్య వ్యూహంతో చేపట్టిన ఈ శిక్షణా శిబిరాలతో మహారాష్ట్రలోని గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం తొణకిసలాడింది. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదం నేపథ్యం, దాన్ని చేరుకొనే మార్గంపై సీఎం కేసీఆర్ చేసిన దిశానిర్దేశానికి అనుగుణంగా శనివారం శిక్షణా శిబిరాల్లో పలు అంశాలపై వక్తలు శిక్షణ ఇచ్చారు. తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు మహారాష్ట్ర రైతులకు ఏ విధంగా చేరాలి? అనే అంశంపై బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదం వివరించారు.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ ఆవశ్యకతపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ, మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గే, మాజీ ఎంపీ హరిభావురాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు చరణ్ వాగ్మారే, రాజు తొడసం, హర్షవర్దన్జాదవ్ తదితరులు చర్చించారు. తెలంగాణలో మహిళా సాధికారత, సంక్షేమంపై పార్టీ మహిళా నాయకురాలు సువర్ణకాటే బగల్ వివరించారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ ఆవశ్యకతను సోషల్ మీడియా వేదికగా ఎలా విస్తరించాలి? అనే అంశంపై జయంత్ దేశ్‌ముఖ్ చర్చించారు. అలాగే బీఆర్ఎస్ ఎజెండా, తొమ్మిదేండ్లలో తెలంగాణ ప్రగతి, ప్రజల జీవితాల్లో వచ్చిన గుణాత్మక మార్పులు అనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మహారాష్ట్ర స్థానిక కళారూపాలను ఎలా వినియోగించుకోవాలి అనే అంశాన్ని ప్రదీప్ సోలంకి వివరించారు. వీరితోపాటు వివిధ అంశాలపై బాలాసాహెబ్ సనప్, గజానన్ అహ్మాదాబాద్కర్, ద్నానేశ్వర్ వకుందర్, దశరథ్ సావంత్ తదితరులు గులాబీ శ్రేణులకు తర్ఫీదు ఇచ్చారు.
శిక్షణ శిబిరాలు ముగిసిన తర్వాత నియోజకవర్గ కన్వీనర్లు, సమన్వయకర్తలు శిక్షణా శిబిరాల వేదిక (నాందేడ్‌లోని అనంత్‌లాన్స్) నుంచి ప్రచార సామగ్రి పట్టుకొని ‘జై మహారాష్ట్ర.. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదాలు చేస్తూ స్వస్థలాలకు కదిలారు. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 22 వరకు నెలపాటు మహారాష్ట్రలోని 45 వేల గ్రామాలు, 5 వేల మున్సిపల్ వార్డుల్లో మొత్తంగా 50 వేల యూనిట్లల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్మాణంపై గులాబీ శ్రేణులకు రెండు రోజుల శిక్షణా శిబిరంలో సంపూర్ణ అవగాహన కలిగిందని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. మహారాష్ట్రవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల్లో బీఆర్ఎస్ గుబులు రేపుతున్నదని పార్టీ నాయకుడు వీ వెంకటాచారి పేర్కొన్నారు. వివిధ మాధ్యమాల ద్వారా మహారాష్ట్రలోని మూలమూలకూ తెలంగాణ మాడల్ పరిచయమైందని, ఈ నెల 22 నుంచి చేపట్టే పార్టీ నిర్మాణంతో ఆ అనుసరణీయమైన మాడల్ మనిషి మనిషికి తెలిసిపోతుందని మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గే తెలిపారు. మహారాష్ట్రలో ఇప్పటివరకూ ఉన్న రాజకీయ పార్టీల అధినేతలు, ఆయా పార్టీల రాష్ట్ర నాయకులు సీఎం కేసీఆర్ మాదిరిగా కేవలం పార్టీ కార్యకర్తలకు సమయం ఇచ్చి కర్తవ్యబోధన చేసిన దాఖలాలు లేవని, బీఆర్ఎస్ తొలి అడుగులోనే మహారాష్ట్రలోని అన్ని రాజకీయ పార్టీల మనసులను గెలిచిందని పార్టీ నాయకులు సుధీర్ సుధాకర్‌రావు బిందు పేర్కొన్నారు. మొత్తంగా రెండు రోజులపాటు నిర్వహించిన బీఆర్ఎస్ శిక్షణా శిబిరాలు మహారాష్ట్ర గులాబీ శ్రేణులకు నూతనోత్సాహాన్ని ఇచ్చినట్టు అయిందని ఆ పార్టీ నేతలు తెలిపారు.