బెంగళూరు : అప్పు వివాదం ఓ ఫ్రెండ్ ప్రాణాన్ని బలి తీసుకున్నది. రూ. 1200 కోసం స్నేహితుడినే అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపారు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది.
కొననకుంటేకు చెందిన మహ్మద్ జిలానీ టీవీ మెకానిక్‌గా పని చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే తనకు డబ్బులు అవసరం ఉండి.. లలిత్ అనే ఫ్రెండ్ వద్ద రూ. 1200 అప్పుగా తీసుకున్నాడు. కానీ తిరిగి ఇచ్చేందుకు జిలానీ ఇబ్బంది పడ్డాడు. కేవలం రూ. 300 మాత్రమే లలిత్‌కు జిలానీ ఇచ్చాడు. మిగతా డబ్బుల విషయంలో ఇరువురి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో జిలానీ వద్దకు లలిత్ తన స్నేహితులను వెంటేసుకుని వచ్చాడు. డబ్బులు ఎప్పుడిస్తావు అని అడుగుతూనే.. ఓ యువకుడు జిలానీపై కత్తితో దాడి చేశాడు. అలా పలుమార్లు జిలానీని కత్తితో పొడిచి చంపాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవర్నీ అరెస్టు చేయలేదు. జిలానీ హత్యతో కిరణ్, పవన్, కార్తీక్‌కు సంబంధం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.