మైసూరు, మే 3: జేడీ(ఎస్) ఎమ్మెల్యే రేవణ్ణ, ఆయన కొడుకు ప్రజ్వల్‌పై మైసూరు పోలీసులు గురువారం రాత్రి కిడ్నాప్, లైంగిక దాడి కేసు నమోదు చేశారు. తన తల్లిని వారు అపహరించారని రాజు అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర కథనం ప్రకారం.. ఫిర్యాదుదారుడి తల్లి ఆరేండ్ల క్రితం రేవణ్ణ ఇంట్లో పనిచేశారు. మూడేండ్ల క్రితం ఆమె పని మానేసి సొంతూరికి తిరిగి వచ్చారు.
అయితే 5 రోజుల క్రితం రేవణ్ణ అనుచరుడైన సతీశ్ బాబన్న రాజు ఇంటికి వచ్చి పోలీసులు వచ్చి విచారణ చేస్తారని.. వారికి ఎలాంటి వివరాలు చెప్పకూడదని.. చెప్తే నువ్వు జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుందని రాజును బెదిరించాడు. ఆ తర్వాత రాజు తల్లిని బైక్‌పై గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఇటీవల వైరల్ అయిన్ సెక్స్ స్కాండల్ వీడియోలో రాజు తల్లిపై ప్రజ్వల్ లైంగిక దాడి చేసిన దృశ్యాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన తల్లి ప్రాణాలకు హాని ఉందని..ఆమెపై లైంగిక దాడి చేశారని రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
హసన్ ఎంపీ రేవణ్ణ మూడేండ్లుగా తనపై లైంగిక దాడి చేస్తున్నాడని హసన్ జిల్లా పంచాయత్ మాజీ సభ్యురాలు (44)ఒకరు బుధవారం సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను జెడ్పీ సభ్యురాలిగా ఉన్న సమయంలో 2021లో ఒకసారి ప్రజ్వల్ ఇంటికి ఒక పని మీద వెళ్లినప్పుడు తనపై లైంగిక దాడి చేశాడని ఆమె తెలిపారు.
‘సందర్శకులంతా వెళ్లిపోయాక ప్రజ్వల్ నన్ను ఓ గదిలోకి లాక్కెళ్లి డోర్ లాక్ చేశాడు. నా భర్త రాజకీయంగా ఎదగాలంటే నేను ఆయన(ప్రజ్వల్) చెప్పినట్టు వినాలని అన్నాడు. ఆ తర్వాత నాపై లైంగిక దాడికి యత్నించాడు. నేను ప్రతిఘటిస్తే తుపాకీతో కాల్చేస్తానని బెదిరించి నాపై లైంగిక దాడి చేశాడు. ఆ ఘటనను ప్రజ్వల్ తన ఫోనులో వీడియో తీసుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ వీడియో లీక్ చేస్తానని బెదిరించాడు. ఇలా బెదిరిస్తూ నాపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తరచూ ఫోన్ చేసి నగ్నంగా తనతో మాట్లాడాలని ఒత్తిడి చేసేవాడు’ అని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.