Joshimath sinking | ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం జోషీమఠ్‌లో భూమి కుంగిపోవడం వల్ల ఆ ప్రాంతం గుండా బద్రినాథ్ వెళ్లే జాతీయ రహదారిపై మూడు మీటర్ల పొడవైన పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పగుళ్ల నేపథ్యంలో అక్కడ 181 భవనాలు ప్రమాదకరంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 275 కుటుంబాలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
కాగా, జాతీయ రహదారిపై పగుళ్ల విషయం తమ దృష్టికి వచ్చిందని చమేలీ డీఎం హిమాన్షు ఖురానా తెలిపారు. పగుళ్లు ఏర్పడిన ప్రాంతంలో సీబీఆర్ఐ (Central Building Research Institute) బృందాలను రంగంలోకి దించినట్లు ఆయన వెల్లడించారు. స్థానిక రహదారి అలైన్మెంట్ కారణంగానే పగుళ్లు వచ్చినట్లు ప్రకటించారు. పగుళ్ల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
మంచు పర్వతాలతో కూడిన సుందర తలమైన జోషీమఠ్ అనేక మందికి పవిత్రమైన దైవభూమి. కానీ అభివృద్ధి, మౌలిక వసతుల పేరిట చేపట్టిన విచక్షణ లేని అశాస్త్రీయ నిర్మాణాల వల్ల మొత్తం ఆ ప్రాంత ఉనికికే ప్రమాదం ఏర్పడుతోంది. గతకొంతకాలంగా చేపడుతున్న పలు ప్రాజెక్టులతో పట్టణం కుంగిపోతోంది. ఏటా 10 సెంటీమీటర్లు మేర అక్కడ భూమి కుంగిపోతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. అక్కడ నివసిస్తున్న ప్రజలను అధికారులు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పట్టణంలో మొత్తం 4,500 భవనాలు ఉండగా.. 863 భవనాలు సురక్షితం కాదని గుర్తించిన అధికారులు ఆ భవనాల కూల్చివేత ప్రక్రియను ఇప్పటికే చేపట్టారు.