న్యూఢిల్లీ, నవంబర్ 8: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అక్రమాల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. విదేశాల్లో డొల్ల కంపెనీలు, బోగస్ కాంట్రాక్టులు, నకిలీ ఇన్వాయిస్లతో ముడుపులు చేతులు మారాయని ఫ్రెంచ్ పరిశోధనాత్మక జర్నల్ ‘మీడియాపార్ట్’ తాజా నివేదికలో బయటపెట్టింది. ఈ కాంట్రాక్టులో అవినీతికి ఆధారాలు ఉన్నా సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు జరుపకూడదని నిర్ణయించాయని వెల్లడించింది. 75 లక్షల యూరోల (రూ.65 కోట్లు) రహస్య కమిషన్ల చెల్లింపులు జరిగాయని, వాటికి సంబంధించిన నకిలీ ఇన్వాయిస్లను ప్రచురించింది. ఫ్రాన్స్‌కి చెందిన దసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి రూ.59 వేల కోట్లతో 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనడానికి మోదీ ప్రభుత్వం 2016 సెప్టెంబర్ 23న ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ డీల్‌లో భారీగా అవినీతి జరిగిందని, ఒక్కో విమానానికి కేంద్రం వెయ్యి కోట్లకు పైగా అధిక ధర చెల్లించిందని ఆరోపణలు వచ్చాయి. యూపీఏ హయాంలో ఒక్కో విమానం ధర రూ.526 కోట్లుగా నిర్ణయిస్తే బీజేపీ ప్రభుత్వం దాన్ని రూ.1,670 కోట్లకు పెంచిందని కాంగ్రెస్ ఆరోపణ. ఇప్పటికే 26 రాఫెల్ విమానాలు దఫదఫాలుగా ఫ్రాన్స్ నుంచి భారత్‌కు చేరాయి. ఈ నేపథ్యంలో మీడియాపార్ట్ నివేదిక సంచలన విషయాలు బయటపెట్టింది.
దర్యాప్తును అటకెక్కించి
రాఫెల్ ఒప్పందంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై మీడియాపార్ట్ దర్యాప్తు చేస్తున్నది. అది బయటపెట్టిన విషయాలతోనే జూలైలో ఫ్రాన్స్ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. మధ్యవర్తి అయిన సుశేన్ గుప్తాకు దసాల్ట్ ఏవియేషన్ రూ.65 కోట్ల ముడుపులు చెల్లించిందని మీడియాపార్ట్ ఇప్పుడు మలి నివేదికలో పేర్కొంది. 2018 అక్టోబర్‌నాటికే సీబీఐ, ఈడీ వద్ద ఈ ఆధారాలు ఉన్నప్పటికీ దర్యాప్తు చేయడంలో ఆ సంస్థలు విఫలమయ్యాయని ఆరోపించింది.
ఆధారాలు అందినా…
మీడియాపార్ట్ నివేదిక ప్రకారం… దసాల్ట్ ఏవియేషన్‌కు మధ్యవర్తిగా వ్యవహరించిన సుశేన్ గుప్తాకు విదేశాల్లో షెల్ కంపెనీలు ఉన్నాయి. వాటికి అక్రమంగా అందిన డబ్బుపై డాక్యుమెంట్లను మారిషస్ అధికారులు సీబీఐ, ఈడీకి 2018 అక్టోబర్ 11న పంపారు. రాఫెల్ డీల్‌లో అవినీతిపై ఫిర్యాదు అందడానికి వారం ముందే ఆ డాక్యుమెంట్లు అందాయి. వాటిలో రాఫెల్ ముడుపులకు సంబంధించిన ఆధారాలు ఉన్నా కూడా దర్యాప్తును ప్రారంభించకూడదని సీబీఐ నిర్ణయించడం గమనార్హం.
ఐటీ సేవల పేరుతో…
సుశేన్ సింగపూర్‌లో ఒక షెల్ కంపెనీతో కథ నడిపారని మీడియాపార్ట్ వెల్లడించింది. ‘ఆ కంపెనీని ఆసియాలో దసాల్ట్‌కు సిస్టమ్ ఇంటిగ్రేటర్‌గా చూపించారు. దాని నుంచి ఐటీ సేవలు పొందుతున్నట్టు చెబుతూ అధిక మొత్తాల్లో దసాల్ట్ బిల్లులు చెల్లించింది’ అని వెల్లడించింది. వీటికి సంబంధించిన ఇన్వాయిస్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు సీబీఐ వద్ద ఉన్నాయన్నది. రాఫెల్ తుది చర్చల రహస్య సమాచారం కూడా రక్షణ శాఖ నుంచి సుశేన్కు చేరిందని మీడియాపార్ట్ పేర్కొంది.