Congress MLA | బెంగళూరు, నవంబర్ 2: కర్ణాటక కాంగ్రెస్లో గ్యారెంటీలపై లొల్లి చల్లారలేదు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని సమీక్షిస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఆర్వీ దేశ్పాండే మద్దతు తెలిపారు. శుక్రవారం దేశ్పాండే మీడియాతో మాట్లాడుతూ.. ‘డీకే శివకుమార్ మంచి ఉద్దేశంతోనే చెప్పారు. గ్యారెంటీ పథకాల కోసం ఏటా రూ.65 వేల కోట్లు అవసరం. కొన్ని మంచి పథకాలు ఉన్నాయి. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఈ పథకాలను దుర్వినియోగం చేస్తున్నారు. ఉదాహరణకు శక్తి పథకం వల్ల కొందరు మహిళలు పదేపదే వెళ్లిన ప్రాంతాలకే మళ్లీ ప్రయాణిస్తున్నారు. ఉచితంగా ఇవ్వడం ఎంత మంచిదో అంత ప్రమాదకరం. మనకు పారదర్శకత ఉండాలి. అర్హులైన మేరకే ప్రమోజనాలు అందాలి. ఈ దిశగా ఆదేశాలు తప్పు కాదు.’ అంటూ వ్యాఖ్యానించారు. కాగా, డీకే శివకుమార్ వ్యాఖ్యలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యతిరేకించినప్పటికీ దేశ్పాండే ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే శక్తి పథకాన్ని సమీక్షిస్తామని డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇప్పటికే ఈ పథకాన్ని సమీక్షిస్తున్నట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా మహిళలు ఉచితంగా ప్రయాణించే దూరంపై పరిమితి విధించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే, రోజువారీగా లేదా నెలవారీగా ఈ పరిమితి విధించాలా అనేది ఆలోచిస్తున్నట్టు చెప్తున్నారు. ఇందుకోసం ముందుగా మహిళలకు స్మార్ట్ కార్డులు జారీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.