Railway | రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్. డిజిటల్ సేవలను ప్రోత్సహించడంలో భాగంగా.. దేశవ్యాప్తంగా 6,117 రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫైని రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. రైల్వే మంత్రిత్వశాఖ ఈ ఫెసిలిటీ కోసం అదనంగా బడ్జెట్‌ను ఆమోదించలేదు. ప్రస్తుతం ఉన్న వనరులను ఉపయోగించుకొని సేవలను ప్రారంభించారు. లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా.. ప్రయాణీకులకు మెరుగైన సౌలభ్యం. సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు డిజిటల్, భద్రతా మౌలిక సదుపాయాలు రెండింటినీ నిరంతరం బలోపేతం చేస్తున్నామని రైల్వేమంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.
ఇప్పటికే ఉన్న వనరులను ఉపయోగించి, పార్టనర్షిప్ మోడల్లో రైల్వేస్టేషన్లలో వై ఫై సేవలను ప్రారంభించారు. వెయిటింగ్లో ప్రయాణీకులకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం, డిజిటల్ ఇండియా ప్రాచారాన్ని బలోపేతం చేయడమే దీని ఉద్దేశం. ఈ సౌకర్యం పెద్ద సంఖ్యలో ప్రయాణీకులకు స్టేషన్లో టికెట్ బుకింగ్, ప్రయాణ సమాచారం, ఇతర ఆన్లైన్ సేవలను సులభంగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది.
రైల్వే స్టేషన్లలో వై-ఫైని యాక్సెస్ చేయడానికి, ప్రయాణీకులు తమ మొబైల్ నంబర్ ద్వారా ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుందని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. గుర్తింపు రుజువు, ఈ-మెయిల్ తదితర వ్యక్తిగత సమాచారం ఏమీ అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ వ్యవస్థలో ప్రయాణీకుల గోప్యత, డేటా భద్రతను నిర్ధారించనున్నట్లు తెలిపింది. ఏదైనా స్టేషన్లో వైఫైలో సాంకేతిక సమస్య తలెత్తితే.. రైల్వే పరిపాలన వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుంది. ప్రయాణీకులకు అంతరాయం లేకుండా ఇంటర్నెట్ను అందించేందుకు ఈ ఫెసిలిటీని తీసుకువచ్చింది.
రైల్వే ప్రయాణీకుల భద్రతను బలోపేతం చేయడానికి, స్టేషన్లు-కోచ్‌లలో సీసీటీవీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ పార్లమెంట్లో మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,731 రైల్వే స్టేషన్లు, 11,953 కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కెమెరాలు మూలధన వ్యయంతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. దేశంలోని అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటైన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో, ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ప్లాట్‌ఫారమ్‌లు, వెయిటింగ్ హాల్స్, టికెట్ కౌంటర్ల వద్ద భద్రత కోసం ఇప్పటికే సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో మొత్తం 250 సీసీటీవీ కెమెరాలు పనిచేస్తున్నాయి.