న్యూఢిల్లీ: విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల విదేశీ మిత్రులను భారత దేశ పర్యాటక రంగంవైపు ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న పథకాన్ని అమలు చేయబోతున్నది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డ్హోల్డర్స్ తమ విదేశీ మిత్రులను వీసా కోసం నామినేట్ చేయవచ్చు.
ఒక ఓసీఐ కార్డ్హోల్డర్ గరిష్ఠంగా ఐదుగురు మిత్రులను నామినేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓ వెబ్సైట్ ద్వారా వీరికి ఉచితంగా ఈ-వీసాలను భారత ప్రభుత్వం జారీ చేస్తుంది. ప్రపంచ పర్యాటక దినోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ మాట్లాడుతూ, ‘చలో ఇండియా’ కార్యక్రమంలో భాగంగా లక్ష మంది విదేశీ పర్యాటకులకు ఉచితంగా వీసాలను ఇస్తామన్నారు.