Vande Bharat | భారతీయ రైల్వే వందే భారత్ రైలును ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ప్రయాణికుల నుంచి వందే భారత్ రైళ్లకు డిమాండ్ ఉన్నది. రైల్వే తాజాగా నాలుగు కొత్తగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. దాంతో మొత్తం వందే భారత్ రైళ్ల సంఖ్య 164కి పెరుగనున్నది. ప్రయాణీకులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన, ఆధునిక ప్రయాణ అనుభవాన్ని అందించనున్నాయి. కొత్తగా నాలుగు రూట్లలో సెమీ హైస్పీడ్ రైళ్లను నడిపించేందుకు రైల్వో బోర్డు ఆమోదం తెలిపిందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ రైళ్లు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. ట్రయల్ రన్ తర్వాత ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కర్నాటక, కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ కేంద్రంగా కొత్త రైళ్లు రాకపోకలు సాగిస్తాయని ఆ అధికారి తెలిపారు.
త్వరలో భారతీయ రైల్వే కేఎస్ఆర్ బెంగళూరు-ఎర్నాకులం, ఫిరోజ్పూర్ కాంట్ – ఢిల్లీ, వారణాసి – ఖజురహో, లక్నో – సహరాన్పూర్ మార్గాల్లో రాకపోకలు సాగించనున్నాయి. కేఎస్ఆర్ బెంగళూరు-ఎర్నాకులం వివరాలు రైల్వే బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. రైలు నంబర్ 26651-26652గా నిర్ణయించారు. బెంగళూరు నుంచి ఉదయం 5.10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.50 గంటలకు ఎర్నాకులం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఎర్నాకులం జంక్షన్ నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు ఎర్నాకులం నుంచి బయలుదేరి రాత్రి 11 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఈ రైలు కృష్ణరాజపురం, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిస్సూర్లలో ఆగుతుంది. ఇదిలా ఉండగా.. రైల్వే మంత్రిత్వశాఖ ప్రకారం.. వందే భారత్ రైళ్లు ప్రతి మార్గంలో వందకంటే ఎక్కవు ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సగటు ఆక్యుపెన్సీ 102.01శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 (జూన్ వరకు) ఆక్యుపెన్సీ 105.03శాతానికి పెరిగిందని రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది.