Union Cabinet | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ.18,541 కోట్ల విలువైన పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో నాలుగు కొత్త సెమీకండక్టర్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్రవేసింది. ఈ ప్రాజెక్టులకు దాదాపు రూ.4,594 కోట్లు ఖర్చు చేయనుండగా.. ఒడిశా, పంజాబ్, ఏపీలో ప్రారంభించనున్నారు. రూ.5,801 కోట్ల వ్యయంతో నిర్మించనున్న లక్నో మెట్రో ఫేజ్ వన్ బీ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగల్న్ ఇచ్చింది. అలాగే, రూ.8,146 కోట్ల వ్యయంతో నిర్మించనున్న క్లీన్ గ్రోత్: టాటో-II జలవిద్యుత్ ప్రాజెక్టును సైతం ఆమోదించింది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే 700 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తవుతుంది. కేంద్ర మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాల గురించిన వివరాలను కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
భారత సెమీకండక్టర్ మిషన్ కింద మరో నాలుగు సెమీకండక్టర్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. SiCSem, కాంటినెంటల్ డివైసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (CDIL), 3D గ్లాస్ సొల్యూషన్స్ ఇంక్, అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ (ASIP) టెక్నాలజీస్‌కు సంబంధించినవని చెప్పారు. ఒడిశా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌లలో యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దాదాపు రూ.4,600 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులతో 2,034 మంది నైపుణ్యం కలిగిన నిపుణులకు ఉపాధి లభిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టులతో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్‌కు ఊతం లభిస్తుందన్నారు. అదే సమయంలో పరోక్షంగా ఉద్యోగాలు కూడా సృష్టిస్తాయని పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం ఐఎస్ఎం కింద మొత్తం పది ప్రాజెక్టులను ఆమోదించినట్లు వెల్లడించారు. గతంలో ఆరు రాష్ట్రాల్లో సుమారు రూ.1.60లక్షల పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. లక్నో మెట్రో రైలు ప్రాజెక్ట్-1బీని సైతం ఆమోదించినట్లు తెలిపారు.
ఈ ప్రాజెక్టులో 12 స్టేషన్లతో 11.165 కిలోమీటర్ల పొడవైన కారిడార్‌ను నిర్మించనున్నట్లు చెప్పారు. మెట్రో రైలు నెట్‌వర్క్‌ను 34 కిలోమీటర్లకు విస్తరించే ప్రణాళిక ఉందని చెప్పారు. అమీనాబాద్, యాహియాగంజ్, పాండేగంజ్ తదితర వాణిజ్య కేంద్రాలు.. కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (మెడికల్ కాలేజ్), ఇమాంబర, చోటా ఇమాంబర, భూల్ భూలైయా, ఘంటాఘర్, రూమి దర్వాజా ప్రాంతాలను మెట్రో నెట్‌వర్క్‌తో అనుసంధామవుతామన్నారు. ప్రాజెక్టు కోసం దాదాపు రూ.5,801 కోట్లు ఖర్చు అవుతాయన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని షియోమి జిల్లాలో 700 మెగావాట్ల టాటో-II జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు రూ.8146.21 కోట్లు ఖర్చవుతుందని.. 72 నెలల కాలంలో పూర్తవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు 2738.06 MU శక్తిని ఉత్పత్తి చేసే 700 MW (4 x 175 MW) సామర్థ్యం ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టును నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం జాయింట్ వెంచర్ కంపెనీ ద్వారా నిర్వహిస్తాయన్నారు.