తెహ్రాన్, జనవరి 29: ఇజ్రాయెల్ కోసం గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై నలుగురికి ఇరాన్ మరణశిక్ష అమలుచేసింది. దేశ రక్షణ విభాగానికి చెందిన ఓ స్థావరాన్ని పేల్చివేసేందుకు ప్లాన్ చేసినట్టు నలుగురిపై నమోదైన అభియోగాలు న్యాయస్థానంలో రుజువయ్యాయి. దాంతో గత ఏడాది సెప్టెంబర్లో అక్కడి న్యాయస్థానం నలుగురికి ఉరిశిక్ష విధించగా, దానిని సోమవారం అమలుచేశారు. ఉరిశిక్ష అమలైన వారిలో ముగ్గురు పురుషులు కాగా, ఒక మహిళ ఉన్నారు. వీరికి ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ ఆఫ్రికా దేశాల్లో శిక్షణ ఇచ్చినట్టు అధికారులు తెలిపారు.