ఖాట్మాండు : నేపాల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు దుర్మరణం పాలయ్యారు. నేపాల్ – భారత్ సరిహద్దుకు సమీపంలో ఉన్న రౌతత్ జిల్లాలో ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. వీరు ప్రయాణిస్తున్న కారు వేగంగా ఉండడంతో అదుపు తప్పి 20 అడుగుల లోతులో నీటిలో మునిగిపోయిందని, అందులో నుంచి బయటకు రాలేకపోవడంతో ఊపిరాడక మృతి చెందినట్లు సమాచారం. అయితే, మృతులను ఇప్పటి వరకు గుర్తించలేదు.
రౌతత్ పోలీసుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి ఝుంఖున్వా చౌక్ వద్ద నుంచి చంద్రనిఘహపూర్ నుంచి గౌర్‌కు వెళ్తున్న సమయంలో రోడ్డుకు దిగువన 20 మీటర్ల లోతున్న చెరువులో పడిపోయిందని తెలిపారు. ఎస్పీ బినోద్ ఘిమిరే మాట్లాడుతూ మృతులు భారతీయులని, ఆధార్‌కార్డులను స్వాధీనం చేసుకొని భారత పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.