Blade Attack | న్యూఢిల్లీ : ఓ బాలుడిపై నలుగురు బాలికలు కలిసి బ్లేడ్‌తో దాడి చేశారు. దీంతో ఆ బాలుడు విలవిలలాడిపోయాడు. ఈ ఘటన ఢిల్లీలోని రోహిణిలో గురువారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. సెప్టెంబర్ 9వ తేదీన ఓ బాలుడు స్కూల్ నుంచి తన ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఓ నలుగురు అమ్మాయిలు రోడ్డుపై బాలుడిని అడ్డగించారు. ఆ తర్వాత అతనిపై బ్లేడ్‌తో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన బాధిత విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బ్లేడ్ గాయాల నేపథ్యంలో 50కి పైగా కుట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు.
దాడికి కారణం ఇదే..
బాధిత బాలుడు చదువుతున్న స్కూల్లో ఓ బాలిక చదువుతోంది. ఆమెతో బాలుడికి వాగ్వాదం జరిగింది. దీంతో మరో స్కూల్లో చదువుతున్న తన సోదరికి ఈ విషయాన్ని తెలియజెప్పింది. బాలుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్న ఇద్దరు సోదరీమణులు తన ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి అతనిపై బ్లేడ్‌తో దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. విద్యార్థులంతా స్కూల్ యూనిఫామ్‌లో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.