ముంబై, ఏప్రిల్ 27 : రాత్రి భోజనంలో బిర్యానీ, పుచ్చకాయ తిన్న తర్వాత ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. ముంబై పైధోనియా ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన మహారాష్ట్రలో సంచలనం రేపింది. ఈ ఘటనలో 40 ఏండ్ల వ్యక్తి, ఆయన భార్య (35), వారి ఇద్దరు పిల్లలు మృతి చెందటం అందర్నీ షాక్కు గురిచేసింది. ఫుడ్ పాయిజనింగ్తోనే వారు చనిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, ఏప్రిల్ 25న రాత్రి ఏర్పాటుచేసిన విందులో 9 మందితో కూడిన ఒక కుటుంబం, మరికొంత మంది దగ్గరి బంధువులు పాల్గొని భోజనం చేశారు. ఇంటికి వస్తూ నలుగురు వ్యక్తులు రాత్రి 1 గంటకు పుచ్చకాయ తిన్నారు. తెల్లవారుజామున వీరందరికీ వాంతులు, విరేచనాలు కావడంతో జేజే దవాఖానలో చేరారు. అయితే కాసేపటికే వారు మృతిచెందారు.