న్యూఢిల్లీ, జూన్ 30: ప్రైవేటు దవాఖానలు ఒక నెలలో ఎన్ని కరోనా టీకాలను కొనుగోలు చేయవచ్చు అన్నదానిపై కేంద్రప్రభుత్వం ఒక ఫార్ములాను రూపొందించింది. దీని ప్రకారం.. అంతకుముందు నెలలోని ఏదైనా ఒక వారంలో సగటున ఒకరోజుకు వేసిన వ్యాక్సిన్ల సంఖ్యను ఆధారంగా తీసుకుంటారు. ఆ సగటుకు రెట్టింపు తదుపరి నెల 30 రోజులకు ఆర్డర్ చేయవచ్చు. ఉదాహరణకు ఒక దవాఖాన జూన్లో గరిష్ఠంగా ఒక వారంలో రోజుకి సగటున 100 వ్యాక్సిన్లు వేసిందనుకుందాం. తదుపరి నెలకు రోజుకి 200 చొప్పున గరిష్ఠంగా 6 వేల టీకాలు (30X100X2=6000) కొనుగోలు చేయవచ్చు. ఒక నెలలో ఏ వారాన్ని పరిగణించాలన్నది దవాఖాన ఇష్టం. కొత్తగా ప్రారంభమయ్యే దవాఖానలకు వాటిలో ఉన్న పడకల సంఖ్యను బట్టి టీకాలను కేటాయిస్తారు. 50 పడకల దవాఖానలు నెలకు గరిష్ఠంగా 3 వేల డోసులకు, 50 నుంచి 300 వరకు పడకలు ఉంటే 6 వేల డోసుల వరకు కొనుగోలు చేయవచ్చు. అన్ని హాస్పిటళ్లకు కరోనా టీకాలు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఈ సూత్రాన్ని తీసుకొచ్చారు. మరోవైపు, జూలై 1 నుంచి కరోనా వ్యాక్సిన్ల కోసం కొవిన్ పోర్టల్ ద్వారా మాత్రమే ఆర్డర్ చేయాలి.